మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన బీర్కూర్ సర్పంచ్ అరిగే ధర్మ తేజ
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా (Kamareddy District)బీర్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Zilla Parishad High School)లో విద్యార్థులకు వండిపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని బుధవారం బీర్కూర్ గ్రామ సర్పంచ్ అరిగే ధర్మ తేజ అకస్మికంగా పరిశీలించారు. పాఠశాలకు విచ్చేసిన ఆయన, భోజన తయారీ విధానాన్ని, వంట గదిలో వాడుతున్న సరుకుల నాణ్యతను, పరిసరాల పరిశుభ్రతను నిశితంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు(Students) వడ్డిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి, వారితో మాట్లాడి భోజన రుచి, నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ధర్మ తేజ మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల ఆరోగ్యమే సమాజానికి పునాది అని స్పష్టం చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు పోషకాహారం అందించాలనే ఉన్నతాశయంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోందని, దానిని అంతే బాధ్యతాయుతంగా క్షేత్రస్థాయిలో నిర్వహించాలని పేర్కొన్నారు. విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి పౌష్టికాహారం ఎంతో అవసరమని, అందుకే ప్రతిరోజూ ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించాలని వంట ఏజెన్సీ నిర్వాహకులను ఆదేశించారు.