సామాజిక సేవతో కూడిన పుట్టినరోజు వేడుకలు ఆదర్శనీయం

26-09-2026 | 11:16pm
  1. నిరుపేద కుటుంబాలకు కానిస్టేబుల్ నిత్యావసర సరుకుల పంపిణీ
  2. మంథని సీఐ బుద్దే స్వామి అభినందనలు

మంథని, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): పుట్టినరోజు వేడుకలను(Birthday celebrations) కేక్‌ కటింగ్‌, ఆర్భాటాలకు పరిమితం చేయకుండా నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచేలా నిర్వహించడం ఆదర్శనీయమని మంథని సీఐ బుద్దే స్వామి(Manthani CI Buddhe Swamy) అన్నారు. మంథని మండలం ఎక్లాస్పూర్‌ గ్రామానికి(Eklaspur village) చెందిన కానిస్టేబుల్‌ తాటి విజయ్‌ కుమార్‌ స్వామి–నిహారిక దంపతులు తమ కుమారుడు తాటి సాయివర్ధన్‌ (టిల్లు) ఐదో పుట్టినరోజు సందర్భంగా వినూత్నంగా సామాజిక సేవా కార్యక్రమాన్ని(Social service program) నిర్వహించారు.

శనివారం మంథని సీఐ కార్యాలయంలో(Manthani CI Office) ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన ఐదు నిరుపేద కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులతో కూడిన కిట్లను సీఐ బుద్దే స్వామి, ఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఐ  స్వామి, ఎస్‌ఐ సందీప్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న నిరుపేదలను ఆదుకోవడం గొప్ప విషయమన్నారు.

పుట్టినరోజు వంటి ప్రత్యేక సందర్భాలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ద్వారా సమాజానికి మంచి సందేశం అందుతుందని పేర్కొన్నారు. చిన్న వయసులోనే సాయివర్ధన్‌కు సేవా భావాన్ని పరిచయం చేస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. సాయివర్ధన్‌ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

సేవలో ముందుండే కానిస్టేబుల్‌ విజయ్‌ కుమార్‌

మంథని పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తాటి విజయ్‌ కుమార్‌ ఉద్యోగ బాధ్యతలతో పాటు తనవంతుగా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. యువతకు, సమాజానికి ఉపయోగపడే సందేశాలను అందించేలా వివిధ సామాజిక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. సామాజిక ప్రయోజనంతో కూడిన ఆయన కార్యక్రమాలకు యువత, ప్రజల నుంచి అభినందనలు లభిస్తున్నాయి.

ఇదే సేవా స్ఫూర్తితో తన కుమారుడి పుట్టినరోజును కూడా నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమంగా నిర్వహించడం పలువురి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ విజయ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. తమ కుమారుడి పుట్టినరోజున నిరుపేదలకు సహాయం చేయడం ద్వారా లభించే తృప్తి ఎంతో ప్రత్యేకమైనదన్నారు.

ప్రతి ఒక్కరూ తమకు తోచినంత మేర సమాజంలోని పేదలకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, యువకులు, లబ్ధిదారులు, కుటుంబ సభ్యులు పాల్గొని సాయివర్ధన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన విజయ్‌ కుమార్‌–నిహారిక దంపతులను అభినందించారు.

మరిన్ని వార్తలు