రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల బిజెపి మండిపాటు
ముకరంపుర, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): గణేష్ నిమజ్జనానికి రాష్ట్ర ప్రభుత్వపరంగా అన్ని సౌకర్యాలు కల్పించాల్సింది పోయి నిమజ్జనాన్ని ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేయడం దురదృష్టకరం అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) అన్నారు.
కరీంనగర్ లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కరీంనగర్ నగరపాలక సంస్థ పరిదిలో జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారంపై మండిపడ్డారు. నగరపాలక సంస్థ పక్షాన నగర మేయర్, డిప్యూటీ మేయర్ గా మేము రాతపూర్వకంగా గణేష్ నిమజ్జనానికి చింతకుంట కెనాల్ కాలువకు ఎస్సారెస్పీ నుండి నీరు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసిన తర్వాత కూడ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం దురదృష్టకరం అన్నారు. మా నాయకులు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కూడ స్వయంగా జిల్లా యంత్రాగంతో పాటు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ కు తెలియజేశారని తెలిపారు.
వెయ్యి భారీ విగ్రహాలు చింతకుంట కెనాల్ లో నిమజ్జనం జరుగుతాయని తెలియజేసిన కూడ ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడం శోచనీయమన్నారు.కొంత మంది కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం నీటిని విడుదల చేసిన సమాచారం మాకు ఉందని అనవసరంగా బీజేపి నాయకులు ఆందోళన చేశారని ప్రజలను తప్పుదోవ పట్టించేలా వాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఈఎన్ సి, సీఈ అధికారులు నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని ఒకవేళ నీరు విడుదల చేస్తే రైతులు అడ్డుకొని నీరు తీసుకుంటారని చెప్పిన మాట వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికే నగరపాలక సంస్థ ద్వారా అన్ని రకాల ఏర్పాట్లు చేసిందన్నారు. చింతకుంట కెనాల్ వద్ద గణేష్ మండప నిర్వాహకుల కోరిక మేరకు భారతీయ జనతా పార్టీ ఆందోళన చేపట్టిందని స్పష్టం చేశారు.
నీరు ఉండి కూడ ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆందోళన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి నీటిని విడుదల చేసిందని ఇలాంటి దుశ్చర్యకు ప్రభుత్వం పాల్పడటం సిగ్గు చేటన్నారు. వేరే మతస్థుల పండగకు నెల ముందే ఏర్పాట్లు చేస్తారు దాన్ని మేము తప్పు పట్టడం లేదని ప్రభుత్వం ద్వంద్వ విధానాన్ని అవలంభించడం సరికాదన్నారు. ఈ మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు పొన్నం లక్ష్మి-మొండయ్య, రామన్, తోట అనిల్, ఒంటెల సత్యనారాయణ రెడ్డి, దేశ శిల్ప వేదం, సోమిడి వేణు, మాసం గణేష్, కో-ఆప్షన్ సభ్యులు బల్వీర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.