రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలది.. తలోదారి!
- ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో ఫెయిల్
- సొంత ఇమేజీ ఫస్ట్.. ఉమ్మడి అంశాలు లాస్ట్
- ఎమ్మెల్యేల తీరుతో పార్టీ వర్గాల్లో తీవ్ర అసహనం
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ప్రజల్లో బీజేపీ(BJP) గ్రాఫ్ పెరిగేందుకు మంచి అవకాశాలున్నా పార్టీ నేతల తీరు మరోలా ఉంటోంది. ఇన్నాళ్లు ఎంపీల మధ్య ఆధిపత్య పోరుతో నానా తంటా లు పడిన పార్టీ.. 8 మంది ఎమ్మెల్యేల మధ్య ఐకమత్యం పూర్తిగా లోపించడంతో కొత్త సమస్యలను ఎదుర్కొంటోంది. ఎవరి ఎజెండా వారిదే.. ఎవరి ఇమేజ్ వారిదే అన్నట్లుగా రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేల(State BJP MLAs) తీరు ఉంటున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో(Assembly sessions) ఎమ్మెల్యేల మధ్య ఇగోలు, విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి.
ఒకే అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాల్సిన ఎమ్మెల్యేలు, ఎవరికి వారు వేర్వేరు అంశాలను లేవనెత్తి, చివరికి అధికార పార్టీకి ఎదురుదాడి చేసే అవకాశం ఇచ్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సస్పెండ్ అవడంతో ప్రధాన ప్రతిపక్ష పాత్ర బీజేపీయే పోషించాల్సింది పోయి ఆ అవకాశాన్ని వీరు ఐకమత్యం లోపించి, జారవిడుచుకున్నారనే చర్చ సాగుతోంది. ఒక ఎమ్మెల్యే హైడ్రా కూల్చివేతలపై మాట్లాడితే, మరో ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ అంటారు.
ఒకరు రైతు రుణమాఫీ అంటే, ఇంకొకరు ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement).. మరొకరు 22 ఏ నిషేధిత జాబితా(22A Prohibited List), ఇంకొకరు కేంద్రప్రభుత్వ పథకాలు(Central Government Schemes), నిధుల కేటాయింపు, ఒకరు స్థానిక నియోజకవర్గ సమస్యలు అంటూ.. ఇలా ఎవరికి వారు తోచినట్లుగా సొంత ఎజెండాను ఎత్తుకుంటున్నారనే చర్చ క్యాడర్‌లో జరుగుతోంది.
అసెంబ్లీలోనే కాదు.. అసెంబ్లీ బయటైనా నిర్ధిష్టమైన వ్యూహం ఉండాలి.- సమిష్టిగా ఒకే అంశాన్ని పట్టుకుని, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం పూర్తిగా వారిలో లోపించింది. దీంతో బీజేపీ బలమైన ప్రతిపక్షంగా కనిపించాల్సిన చోట, చీలికలు పీలికలుగా కనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్యేల తీరుపై విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎవరి ఇమేజీ వారికే..
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, ఎమ్మెల్యేల మధ్య వ్యక్తిగత ఇగోలే ఈ పరిస్థితికి కారణం. ‘నేను సీనియర్’, ‘నా నియోజకవర్గ సమస్యే ముఖ్యం‘, ‘నా మాట వినాలి‘, ‘ఇలానే చేద్దాం’ అనే ధోరణిలో కొం దరు ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరికొందరు భవిష్యత్తులో మంత్రి పద వులు, పార్టీలో కీలక పదవుల కోసం ఇప్పటినుంచే సొంత ఇమేజీ పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారని టాక్. ఒకరిద్దరు ఏకంగా కాంగ్రెస్ పార్టీతో అంటకాగుతున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. భవిష్యత్తులో మరోసారి గెలవాలంటే కార్యకర్తల్లో, ప్రజల్లో ఇమేజీ పెంచుకోవాలనే తపనే వారిలో కనిపిస్తుంది కానీ, పార్టీ బలపడితే తామూ బలపడతాం.. గెలుస్తామనే ధోరణి పలువురు నేతల్లో కనిపించడంలేదని చర్చ జరుగుతోంది.
పార్టీ నాయకత్వంలో అసహనం..
ఎమ్మెల్యేల ఈ తీరుపై రాష్ట్ర నాయకత్వంతో పాటు, దిగువస్థాయి కార్యకర్తల్లో కూడా తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. ముఖ్యమైన నాయకుల మధ్య సక్యతలేకనే పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదని, ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడిస్తే రాబోయే గ్రాడ్యుయేట్, ఐదు కార్పొరేషన్ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఎంపీల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని సర్దిచెప్పింది. ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌తోపాటు, పార్టీ ఇన్‌చార్జ్‌లు రంగంలోకి దిగి పరిస్థితి చక్య దిద్దారు. ఢిల్లీ వేదికగా ఎంపీలంతా ఐక్యంగా ఉండిపోయారు.
డిన్నర్‌లు, లంచ్ మీటింగ్‌లకు ఆహ్వానించుకోవడం పార్టీలో శుభపరిణామం అనుకున్న కొన్ని రోజులకే ఇప్పుడు ఎమ్మెల్యేల మధ్య సక్యత లేకపోవడం పార్టీకి నష్టం చేకూరే అవకాశమే ఉంది. మరీ ఎమ్మెల్యేల విషయంలో కూడా హైకమాండ్ రంగంలోకి దిగి క్లాస్ తీసుకుంటుందా? లేక ‘ఎవరి ఎజెండా వారిదే’ అన్నట్లుగానే కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి. మొత్తానికి.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఢీకొట్టాల్సిన బీజేపీ, ముందు తన ఇంట్లో గొడవలు చక్కదిద్దుకోకపోతే.. ప్రతిపక్షంలో కూడా ప్రభావం చూపలేకపోవచ్చనే అభిప్రాయాన్ని రాజకీయ విళ్లేషకులు వ్యక్తంచేస్తున్నారు.