ఎమ్మెల్యేల అరెస్టుపై బీఆర్‌ఎస్ రాస్తారోకో
కరీంనగర్ , సెప్టెంబరు 7 (విజయ క్రాంతి): ప్రజా సమస్యలపై నిలదీసేందుకు అసెంబ్లీ సమావేశాలకు నల్ల చొక్కాలు ధరిం చి వెళ్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకుని, అరెస్ట్ చేయడాన్ని నిరసి స్తూ బీఆర్‌ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా రాస్తారోకో నిర్వ హించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ధ్వజమెత్తారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందడం లేదని, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ లేదు, పేదలకు ఆసరా పెన్షన్లు సక్రమంగా అందడం లేదని విమర్శించారు. రైతన్నలకు రైతుబంధు, రైతు బీమా కరవయ్యాయని, జీవిత కాలం సేవ చేసి రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక నానా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తారనే భయంతోనే నల్ల చొక్కాలతో వస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయించిందని మండిపడ్డారు. తక్షణమే ఎమ్మెల్యేలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణ రావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్, కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
