అన్ని వర్గాల సమస్యలపై చర్చ జరగాలి

08-09-2026 | 04:45am
  1. రైతులు, సింగరేణి కార్మికులు, ఆటో డ్రైవర్ల వెతలపై సర్కారును నిలదీస్తాం
  2. ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన ప్రభుత్వాన్ని ప్రజలే నిషేధిస్తారు
  3. నెలరోజులు అసెంబ్లీ నడపాలి
  4. గన్ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్య లపైనా కూలంకషంగా చర్చ జరగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) పేర్కొన్నారు. రైతులు, సింగరేణి కార్మికులు, ఆటోడ్రైవర్ల తరఫున సర్కారును నిలదీస్తామని స్పష్టం చేశారు. 22 ఏ ద్వారా ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టిన ఈ ప్రభుత్వాన్ని ప్రజల నిషేధిస్తారన్నారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సోమవారం గన్‌పార్క్ వద్ద అమరవీరులకు పార్టీ శ్రేణులతో కలిసి కేటీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సబ్బండ వర్గాలను మోసం చేసిందన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని 420 హామీలు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారని గుర్తు చేశారు.

వెయ్యి రోజులైనా ఇప్పటిదాకా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. అందుకే శాసనసభలో కాంగ్రెస్‌ను ఎండగట్టాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారని,  ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సూచించారని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరి తరఫున కాంగ్రెస్‌ను ఈ సమావేశాల్లో పలు ప్రశ్నలు అడుగుతామని తెలిపారు.

97 జీవో రియల్ ఎస్టేట్ కోసం తీసుకువచ్చిందని, పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. రూ. 18 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై నిలదీస్తామన్నారు. నెల రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నడపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, అంగన్వాడీలు, సర్వేయర్లపై చర్చ జరగాలన్నారు. సీఎం, మంత్రుల బంధువులకు అక్రమంగా భూ కేటాయింపులు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను ఎన్ని అవమానాలు చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడండి అని కేసీఆర్ పిలుపునిచ్చారని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు