మహిళా స్ఫూర్తిదాయిని ఐలమ్మ

26-09-2026 | 01:15pm

వెట్టి చాకిరీ, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా వీరనారి పోరాటం

మహిళల్లో ఆత్మగౌరవం, ధైర్యాన్ని నింపిన ఐలమ్మ

మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని.

హుజురాబాద్, సెప్టెంబర్ 26: (విజయక్రాంతి): తెలంగాణ మహిళా స్ఫూర్తిదాయిని, పేదల హక్కుల కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ailamma) అని మున్సిపల్ చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని, జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్9State Convener of the Festival Committee) నిమ్మటూరి సాయికృష్ణ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని ఏరియా హాస్పిటల్ వద్దగల ఐలమ్మ విగ్రహం వద్ద శనివారం వీరనారి చిట్యాల ఐలమ్మ 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ తెలంగాణలో సామాజిక అసమానతలు, పెత్తందారీ దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన వీరనారి అని కొనియాడారు. భూమి, కూలి, ఆత్మగౌరవం కోసం అణగారిన వర్గాల ప్రజలను చైతన్యపరిచిన ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి కూడా ఆదర్శమన్నారు. అప్పటి సామాజిక పరిస్థితుల్లో మహిళగా అనేక అడ్డంకులను ఎదుర్కొంటూనే అన్యాయానికి తలొగ్గకుండా పోరాటం చేయడం ఆమె ధైర్యసాహసాలకు నిదర్శనమన్నారు.

ప్రజలపై పెత్తందారుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఐలమ్మ నిలబడటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రజల్లో చైతన్యం పెరగడానికి దోహదపడిందన్నారు. తనకు ఎదురైన అన్యాయాన్ని వ్యక్తిగత సమస్యగా కాకుండా సామాన్య ప్రజల హక్కుల సమస్యగా భావించి పోరాడిన ఆమె జీవితం సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచిందన్నారు. మహిళలు కూడా సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించగలరని, హక్కుల కోసం పోరాడగలరని ఐలమ్మ తన జీవితంతో చాటిచెప్పారని పేర్కొన్నారు.

ఐలమ్మ ఆశయాలను నేటి తరానికి పరిచయం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఆమె పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ సామాజిక సమానత్వం, మహిళల ఆత్మగౌరవం, పేదల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి. కిషన్, మున్సిపల్ మేనేజర్ భూపాల్ రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, రాజపల్లి సర్పంచ్ కట్టుకూరి మల్లారెడ్డి, కౌన్సిలర్లు భారతి, పుణ్యలత, సొల్లు సునీత, మొగిలి, సమ్మయ్య, బండ సింధుజ, బండ నరేష్, శ్రీనివాస్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు, రజక సంఘం నాయకుడు కొలిపాక శ్రీనివాస్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మేకల తిరుపతి, మాజీ కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్, కాంగ్రెస్ మహిళా పట్టణ అధ్యక్షురాలు వేముల పుష్పలత, రామారపు రాధ, భూలక్ష్మి, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, జనార్ధన్, కాంగ్రెస్ నాయకులు సొల్లు బాబు, కోయల్కర్ బాలాజీ, సుంకరి రాజమౌళి, మున్సిపల్ జవాన్ ప్రతాపరాజు, కొలిపాక రమేష్, రామారావు లక్ష్మణ్‌తో పాటు రజక సంఘం నాయకులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు


మరిన్ని వార్తలు