కోదాడలో ఘనంగా చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు
కోదాడ సెప్టెంబర్ 26,(విజయక్రాంతి) : తెలంగాణ సాయుధ పోరాట(Telangana Armed Struggle) వీరవనిత చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను శనివారం కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం(Municipal Office) ఎదుట ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి టీపీసీసీ ప్రతినిధి లక్ష్మీనారాయణ రెడ్డి(TPCC spokesperson Lakshminarayana Reddy), ఎర్నేని బాబు, పారసీతయ్య, పిల్లుట్ల శ్రీను తదితర ముఖ్య నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నాటి హైదరాబాద్ సంస్థానంలో కొనసాగిన నిజాం నిరంకుశ పాలనకు, భూస్వామ్య దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట పటిమ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం ఆమె సాగించిన పోరాటం ప్రజల్లో చైతన్యాన్ని నింపిందన్నారు.ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో సాగిన ప్రజా ఉద్యమంలో ఐలమ్మ కీలకంగా పాల్గొన్నారని తెలిపారు.
పాలకుర్తిలో విస్నూర్ రామచంద్రారెడ్డి వర్గం నుంచి ఎదురైన దౌర్జన్యాలకు, అణచివేతకు ఆమె ఏమాత్రం భయపడకుండా ఎదురొడ్డి నిలిచారని గుర్తుచేశారు. తన ప్రాణాలను, ఆస్తులను సైతం లెక్కచేయకుండా ప్రజల హక్కుల కోసం పోరాడారని అన్నారు.ఐలమ్మ తన ఇంటినే సంఘం కార్యకలాపాలకు వేదికగా మార్చి ఉద్యమానికి అండగా నిలిచారని పేర్కొన్నారు. నిజాం పాలకుల నుంచి నిర్బంధం, చిత్రహింసలు ఎదురైనా ఆమె తన పోరాట పంథాను వీడలేదని తెలిపారు.
అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చూపిన తెగువ, పట్టుదల, ధైర్యం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.అందుకే నేటి ప్రభుత్వం ఆమె పోరాటానికి గుర్తింపుగా మహిళా విశ్వవిద్యాలయానికి.. ఐలమ్మ మహిళ విశ్వవిద్యాలయం గా నామ కరణం చేసింది. ఆమే పోరాటానికి గుర్తింపుగా వరంగల్ ఎకరం లో ఐలమ్మ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయలని, ఆమె చిత్రపటాన్ని అసెంబ్లీలో ఏర్పాట చేయలని డిమండ్ చేస్తున్నాము అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సట్టు ఎల్లయ్య, పిల్లుట్లు కృష్ణయ్య, పొనుగోడు కోటయ్య,డి ఎన్ స్వామి, గండారవు వీరయ్య, ఉల్లెందుల లింగయ్య, సతీష్, రమణ, తంగేళ్ల సురేష్, సట్టు శ్రీను, భూమా శ్రీను, గోపాలకృష్ణ, శివ, ప్రసాద్, వీరయ్య, ఆత్కూరి భాస్కర్, పెద్దారపు నాగేశ్వరావు, మొదలగున్నవారు పాల్గన్నారు .