డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి మోసం...!
కౌటాల, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): డబ్బులు పెట్టుబడి(Investment)గా పెడితే రెట్టింపు చేసి కోట్ల రూపాయలు ఇస్తామని నమ్మించి ఇద్దరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు కౌటాల మండలానికి చెందిన ఇద్దరు వ్యాపారులను మోసం చేసినట్లు సమాచారం. శుక్రవారం జరిగిన ఈ ఘటనలో బాధితుల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల నుంచి రూ.8.50 లక్షల వరకు నగదు, బంగారు చైన్, ఉంగరాలు తీసుకుని పరారైనట్లు తెలుస్తోంది.మహారాష్ట్రకు చెందిన వ్యక్తులు వ్యాపారులను నమ్మించి మత్తు మందు ప్రయోగించడంతో వారు స్పృహ కోల్పోయారని, అనంతరం నగదు, బంగారం తీసుకుని వెళ్లినట్లు సమాచారం.
మత్తు ప్రభావంతో బాధితులు శుక్రవారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలుస్తోంది. ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో కౌటాల పోలీసులు, కాగజ్నగర్ డీఎస్పీ ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. మహారాష్ట్ర వ్యక్తులకు, వ్యాపారులకు మధ్యవర్తులుగా మొగడధగడ్ గ్రామానికి చెందిన ముగ్గురు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాలేదని కౌటాల ఎస్ఐ సతీష్ తెలిపారు.