సారంపల్లి మృతి రైతాంగానికి తీరని లోటు
- మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన రైతు నాయకుడు
- వ్యవసాయంపై పూర్తి అవగాహన ఉన్న ‘ఎన్‌సైక్లోపీడియా’ సారంపల్లి
- సారంపల్లి మల్లారెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచేలా నిర్ణయం తీసుకుంటాం
- సంస్మరణ సభలో సీఎం రేవంత్‌రెడ్డి
ముషీరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): రైతుల కోసం జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి మరణం రైతాంగానికి తీరని లోటని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. సోమవారం రవీంద్రభారతిలో జరిగిన జాతీయ రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి(Sarampalli Mallareddy) సంస్మరణ సభలో ఆయన పాల్గొని, సారంపల్లి చిత్రటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు ఎదిగి రైతుల సమస్యలపై నిరంతరం పోరాడిన నాయకుడిగా సారంపల్లిని కొనియాడారు.
కౌలు రైతుల సమస్యలు, పంటలకు గిట్టుబాటు ధర కోసం ఆయన చేసిన పోరాటాలను సీఎం గుర్తుచేశారు. భూమి సారం నుంచి పంట చేతికి వచ్చే వరకు రైతులు ఎదుర్కొనే సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న ‘ఎన్‌సైక్లోపీడియా’ సారంపల్లి అని అన్నారు. ఆయన రాసిన పుస్తకాలు, లేవనెత్తిన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైతాంగ సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. భూమిలేని నిరుపేదలకు కనీస వేతనం, దున్నేవాడికి భూమి కోసం కమ్యూనిస్టులు పోరాడారని, ఆయా సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు చట్టాల ద్వారా పరిష్కారాలు చూపాయని పేర్కొన్నారు.
దేశంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి పోరాడాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. ఎస్‌ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లను లక్ష్యంగా చేసుకున్నారని, తెలంగాణలో కోటి ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు.
పేద ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు కమ్యూనిస్టులు పోరాడాలని పిలుపునిచ్చిన రేవంర్‌రెడ్డి.. దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి నరేంద్రమోదీ. మోదీ ఓటమే కమ్యూనిస్టుల గెలుపు అని అన్నారు. సారంపల్లి మల్లారెడ్డి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేయడానికి మంత్రివర్గ సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. మంత్రి మహ్మద్ అజారుద్దీన్, మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పాల్గొన్నారు.
