ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

09-09-2026 | 10:18pm

పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ నేపథ్యంలో కలెక్టర్ భవేష్ మిశ్రా

బోధన్,(విజయక్రాంతి): పోలీసు శాఖలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా(Collector Bhavesh Mishra) సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణను సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షలకు సమర్థంగా సిద్ధం కావాలని ఆయన అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో కొనసాగుతున్న ప్రీ-రిక్రూట్‌మెంట్ శిక్షణ శిబిరాన్ని(pre-recruitment training camp) కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్యతో కలిసి బుధవారం సందర్శించారు.

ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో మాట్లాడి శిక్షణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ ఉద్యోగాలకు ఎంపిక కావాలంటే రాత పరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ ప్రతిభ చూపాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అందువల్ల అభ్యర్థులు క్రమ శిక్షణతో శిక్షణ పొందుతూ ప్రతిరోజూ చదువుతో పాటు శారీరక వ్యాయామానికి కూడా సమయం కేటాయించాలని సూచించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు. శిక్షణలో అందిస్తున్న బోధన, స్టడీ మెటీరియల్, నిపుణుల సూచనలను పూర్తిగా వినియోగించుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. అభ్యర్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రణాళికాబద్ధంగా చదివితే పోలీస్ ఉద్యోగాలను సాధించడం సాధ్యమేనని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు