ప్రజావాణిలో ఎంపీడీవోకు కాలనీవాసుల వినతిపత్రం
బేల సెప్టెంబర్ 21(విజయక్రాంతి): బేల మండల కేంద్రంలోని అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో(Ashoknagar Primary School) విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలి తాత్కాలిక బదిలీని నిలిపివేయాలని కోరుతూ అశోక్‌నగర్ కాలనీవాసులు సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో మహేష్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో తమ పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకునేవారని, ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య అందిస్తామని ఉపాధ్యాయులు హామీ ఇవ్వడంతో తమ పిల్లలను అశోక్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో చేర్పించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉపాధ్యాయురాలిని తాత్కాలిక బదిలీపై వేరే పాఠశాలకు పంపిస్తే తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించకుండా తిరిగి ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఇబ్బందులు కలగకుండా ఉపాధ్యాయురాలి తాత్కాలిక బదిలీని వెంటనే నిలిపివేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎబివిపి జిల్లా సభ్యలు మాడా వార్ హరీష్, కాలని వాసులు శ్రీనివాస్ , ఆశన్న, సాయి , తదితరులు పాల్గొన్నారు.