వ్యవస్థల మధ్య సంఘర్షణ
వెంకగారి భూమయ్య :
తెలంగాణ శాసనసభ వేదికగా(Telangana Legislative Assembly) ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, అసెంబ్లీ గేటు(Assembly gate) వద్ద ప్రతిపక్షాల(opposition parties) నిరసనలు, పోలీసుల జోక్యం(Police intervention), ప్రజాప్రతినిధుల ప్రవర్తన రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా రాజ్యాంగ వ్యవస్థల పరిధిపై సరికొత్త చర్చకు తెరలేపాయి. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పట్ల తమ నిరసనను వ్యక్తం చేసేందుకు నల్లటి టీషర్టులు ధరించి అసెంబ్లీకి చేరుకున్న ప్రతిపక్ష బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలను(BRS MLAs and MLCs) పోలీసులు మెయిన్ గేటు వద్దే అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ క్రమంలో జరిగిన నెట్టివేతలు, తోపులాటలు, ప్రజాప్రతినిధుల బలవంతపు అరెస్టులు, మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు ఒకవైపు తీవ్ర వివాదాస్పదమవ్వగా, మరోవైపు అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ వ్యవస్థను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల సంస్కారంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.శాసనసభ్యులు సభా నిబంధనలు లేదా డ్రెస్ కోడ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడితే, వారిపై చర్యలు తీసుకునే సంపూర్ణ అధికారం శాసనసభాపతికి మాత్రమే ఉంటుంది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులను అడ్డుకునే అధికారం పోలీసులకు లేదనే చెప్పాలి. రాజ్యాంగబద్ధమైన శాసన వ్యవస్థ వ్యవహారాల్లో కార్యనిర్వాహక వ్యవస్థ లేదా పోలీసుల అతి జోక్యం ప్రజాస్వా మ్య సూత్రాలకే విరుద్ధం. అయితే, ఈ రాజకీయ రగడ, ఘర్షణల నడుమ అత్యంత ఆందోళనకరమైన అంశం ఏమిటంటే, అసెంబ్లీ సాక్షిగా స్పీకర్‌ను అవమానపరచడం, అసభ్యకరమైన పదజాలంతో నిందించడం. అత్యున్నత రాజ్యాంగ పీఠంపై ఉన్న వ్యక్తిని, అందులోనూ దళిత నాయకుడిని ఏకవచనంతో సంబోధిస్తూ, అసభ్యకరమైన పదజాలం వాడటం ఎంతమాత్రం సమంజసం కాదు.
రాజకీయ వ్యూహాలు, ఆందోళనలు, విమర్శలు ఎంత తీవ్రస్థాయికి చేరినా మాట్లాడే భాషా సంప్రదాయాలు, సభా సంస్కారం దిగజారకూడదు. చట్టసభలో అత్యున్నత స్థానమైన స్పీకర్ పదవిని, ఆ స్థానంలో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి వక్ర భాషను ఉపయోగించడం ఏ రకమైన రాజకీయ సంస్కృతికి నిదర్శనమో ప్రతిపక్షాలు సమాధానం చెప్పాలి. కాగా, అధికారంలో ఏ పార్టీ ఉన్నప్పటికీ, విధి నిర్వహణలో ఉండే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు రాజ్యాంగ నిబంధనలు, ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం పనిచేయాల్సి వస్తుంది.
ఏ పార్టీ అధికారంలోకి ఉన్నా, విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులను బలి చేయడం నిత్యకృత్యంగా మారింది. నిరసనల సమయంలో ప్రజాప్రతినిధులతో, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసులు హద్దులు దాటి ప్రవర్తించారన్న ఆరోపణలు ఎంత తీవ్రంగా పరిగణించాల్సిన అంశమో, చట్టసభ లోపలా, వెలుపలా ప్రజాప్రతినిధులు హుందాతనాన్ని విస్మరించి ప్రవర్తించడం, అధికారులను బెదిరించేలా మాట్లాడటం కూడా అంతే తీవ్రమైన తప్పు.
మరోవైపు ప్రతిపక్ష పార్టీలు తమ నిరసన పద్ధతులను, సభా మర్యాదలను, ప్రజాస్వామ్య విధులను ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు అయినప్పటికీ, ఆ నిరసనలు ప్రజా సమస్యలను ఎత్తిచూపేలా ఉండాలే తప్ప, చట్టసభల కార్యకలాపాలను పూర్తిగా స్తంభింపజేసేలా లేదా స్పీకర్ వ్యవస్థనే కించపరిచేలా ఉండకూడదు. ప్రభుత్వం గతంలో చేసి న హామీలను, సంక్షేమ కార్యక్రమాలను నెరవేర్చడంలో విఫలమైందని భావిస్తే, ప్రతిపక్షాలు స్పష్టమైన ఆధారాలు, వాదనలతో ప్రభుత్వాన్ని సభ లోపల నిలదీయాలి.
అదే సమయంలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, వారి విమర్శలను అణచివేయడానికి పోలీసు వ్యవస్థను సాధనంగా వాడుకోవడం అధికార పక్షానికి కూడా తగదు. అధికార పక్షం సభలో చర్చలకు తగినంత సమయం ఇచ్చి, ప్రతిపక్షాల విమర్శలను స్వీకరించే సహనం ప్రదర్శించాలి. ప్రతిపక్షం స్పీకర్ వ్యవస్థను, ఒక దళిత నేత ఉన్న సభాధ్యక్ష స్థానాన్ని, సభా సంప్రదాయాలను గౌరవిస్తూ అర్థవంతమైన వాదనలతో ముందుకుసాగాలి.
రక్షణ బలగాలు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, రాజ్యాంగ పరిమితులకు లోబడి మాత్రమే తమ విధులను నిర్వహించాలి. చట్టసభలు ప్రజల సమస్యల పరిష్కారానికి, సమగ్ర వికాసానికి వేదికలు కావాలి తప్ప, రాజకీయ ప్రతిష్టంభనలకు, పోలీసు దౌర్జన్యాలకు, స్పీకర్‌ను అవమానించే అనుచిత వ్యాఖ్యలకు నిలయాలు కాకూడదు.
వ్యాసకర్త: జర్నలిస్ట్, 9848559863