రేవంత్ ప్రభుత్వం గూండాగిరి
హామీల అమలులో విఫలం
కాంగ్రెస్ అగ్రనేతలకు ఒక న్యాయం.. కేటీఆర్, హరీశ్‌రావుకు మరో న్యాయమా?
రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా భయపడబోం
మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తోందని, దౌర్జన్యకాండకు, గూండాగిరికి పాల్పడుతోందని మాజీ మంత్రి ప్రశాంత్‌రెడ్డి(Former Minister Vemula Prashanth Reddy) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, వెయ్యి రోజుల పాలన నిష్ఫలంగా మారిందని విమర్శించారు.
రేవంత్ రెడ్డి శిఖండి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభకు వస్తే.. రేవంత్‌రెడ్డి బండారం బయటపడుతుందని, ప్రభుత్వం వైఫల్యాలు బహిర్గతం అవుతాయనే ‘నీవు సభకు రానివ్వడం లేదు’ అని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న బీఆర్‌ఎస్ నేతలను పోలీసులు అడ్డుకోవడం, ప్రజాపాలన ఎలా అవుతుందన్నారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పోలీసులు భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. కేటీఆర్‌ను కిందపడేసి పోలీసులు తొక్కిన ఘటనను తెలంగాణ సమాజం చూసిందన్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ నేతలు బ్లాక్ టీషర్టులు ధరించి నిరసనకు రావడమే తప్పుగా మారిందా అని ప్రశ్నించారు.
బ్లాక్ టీ షర్టులు రేవంత్‌రెడ్డికి నచ్చడం లేదని, బహుశా పచ్చ టీ షర్టులు వేసుకుని వస్తే తమను అనుమతిస్తారేమోనని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ, అదానీకి వ్యతిరేకంగా టీ షర్టులు ధరించి నిరసన తెలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ అగ్రనేతలకు ఒక న్యాయం, కేటీఆర్, హరీశ్‌రావుకు మరో న్యాయమా అని ప్రశ్నించారు. మాజీ హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి గొంతును పోలీసులు నొక్కారని, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగారని ఆరోపించారు.
ప్రజల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతి నిధుల పట్ల పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించడం దారుణమన్నారు. అసెంబ్లీ పరిసరాల్లో వేలాది మంది పోలీసులను మోహరించడం, ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతంలో గ్రేహౌండ్స్ దళాలను ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. తనను రెండుసార్లు పోలీసులు వాహనంలోకి ఎత్తివేశారని చెప్పారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఘటనలు చూడలేదని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలు చేసినా బీఆర్‌ఎస్ భయపడబోదని స్పష్టం చేశారు. తాము కేసీఆర్ సైనికులమని, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగేది లేదన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్‌ను అవమానించడం అంటే తెలంగాణ సమాజాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు.
