6 September, 2026 | 9:23 PM

ప్రజాపాలన అందించడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం: మాజీ ఎమ్మెల్యే

06-09-2026 | 08:11pm

బాన్సువాడ, సెప్టెంబర్ 6 (విజయ క్రాంతి): రాష్ట్రంలో ప్రజాపాలన అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం(Congress government) పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌(Bajireddy Goverdhan) విమర్శించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో బాన్సువాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సమరభేరి’, గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్యంపై నిరసన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులతో కలిసి గ్రామంలోని మురుగునీటి కాలువలు, శిథిలావస్థకు చేరిన గ్రామపంచాయతీ భవనం, నర్సరీని పరిశీలించారు. 

నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ భవనం ప్రమాదకర స్థితికి చేరిందని బాజిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో పంచాయతీ సిబ్బంది భయాందోళనల మధ్య విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. సిబ్బంది ప్రాణాలకు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. 

కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేశామని బాజిరెడ్డి అన్నారు. వైకుంఠధామాలు, నర్సరీలు, మొక్కల పెంపకం, మురుగునీటి కాలువలు, రోడ్లు తదితర సౌకర్యాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రస్తుతం వాటి నిర్వహణ, మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. 

కేసీఆర్‌ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని పేర్కొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాన్ని విస్మరించిందని ఆరోపించారు. 

స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌దే పూర్వ వైభవం

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయమని బాజిరెడ్డి గోవర్ధన్‌ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా పనిచేసి ప్రజా సమస్యలను ఎత్తిచూపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు నర్సింలు గౌడ్‌, టేకుర్ల సాయిలు, మెగావత్ భాస్కర్ అక్తర్‌, కృష్ణ, భూమయ్య, రాము, మోసిన బాబు, లక్ష్మణ, భాస్కర్, అల్లం గంగారం, సుంచు శేఖర్, నాగరాజు, గంపల శంకర్, వెంకట్, మోచి గణేష్, ఎజాజ్, గాండ్ల మధు, గోపిరెడ్డి కిషన్, సార్ నవీన్, తెల్ల రవి, అఖిమ్, బాలకృష్ణ, సంజీవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు