జూనియర్ అసిస్టెంట్‌కు నిబంధనలు వర్తించవా...?
సమయపాలనపై ప్రశ్నలు... ఉన్నతాధికారుల మౌనంపై విమర్శలు...!
బాన్సువాడ, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో విధుల నిర్వహణ, సమయపాలనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జూనియర్ అసిస్టెంట్ విధులకు సమయానికి హాజరు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు పేర్కొంటున్నారు.
విధులకు సమయపాలన పాటించకపోతున్నారనే ఆరోపణలు ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఉద్యోగి విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారా? లేక ఏదైనా కారణంతో వత్తాసు పలుకుతున్నారా? అనే చర్చ కార్యాలయ వర్గాల్లో సాగుతోంది.ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు నిర్ణీత సమయానికి విధులకు హాజరై ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి హాజరు రిజిస్టర్, బయోమెట్రిక్ హాజరు, విధుల నిర్వహణపై సమగ్రంగా పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.