హైదరాబాద్‌కు కామన్ పాస్.. ఇక జర్నీ ఈజీ!
హైదరాబాద్‌లో కామన్ పాస్.. మంత్రులతో భట్టి మెట్రో జర్నీ!
హైదరాబాద్: నగర ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేలా ఆర్టీసీ–మెట్రో కామన్ ట్రావెల్ పాస్(RTC-Metro Common Travel Pass) అందుబాటులోకి వచ్చింది. ప్రజాభవన్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఈ కామన్ పాస్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులందరికీ ఆర్టీసీ, మెట్రో డే పాస్‌లను కొనుగోలు చేశారు. కామన్ పాస్‌తో ఆర్టీసీ బస్సు, మెట్రో సేవలను వినియోగించుకునే అవకాశం కల్పించారు.
రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి మంత్రులు మెట్రోలో ప్రయాణించనున్నారు. నగరంలో ప్రజా రవాణాను అనుసంధానించే దిశగా ఈ సదుపాయం కీలక అడుగుగా ప్రభుత్వం పేర్కొంటోంది.
ఇదే కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) హైదరాబాద్‌లో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం నగరంలో సుమారు రూ.52 వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూ.38 వేల కోట్లతో ప్రణాళికలు ఉన్నాయని చెప్పారు.
అలాగే రూ.30,627 కోట్ల అంచనా వ్యయంతో 366 కిలోమీటర్ల మేర రీజినల్ రింగ్ రోడ్ (RRR) నిర్మాణం చేపట్టనున్నట్లు పొన్నం వివరించారు. కాగా, హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 122.9 కిలోమీటర్ల విస్తరణకు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించినట్లు అధికారిక సమాచారం వెల్లడిస్తోంది.