30-08-2025 09:01:46 PM
ఆపద సమయంలో అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యాధికారి సూచన...
అదిలాబాద్ (విజయక్రాంతి): జిల్లాలో పనిచేస్తున్న అత్యవసర వైద్య సేవల 108, 102 ప్రాజెక్ట్ వాహనాల పనితీరుపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారి నరేందర్ రాథోడ్(District Medical Health Officer Narender Rathod) సమీక్షించారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా ప్రోగ్రాం మేనేజర్ సామ్రాట్, జిల్లా కోఆర్డినేటర్ రాజ శేఖర్ లతో కలిసి అత్యవసర వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాహనాల పనితీరును సమీక్షించి, రోగులకు అందిస్తున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా వాహనాల హాట్‌స్పాట్ లొకేషన్లు, వాహనాల స్పందన సమయం, ఆసుపత్రికి చేరేవరకు ఇచ్చే ప్రాథమిక వైద్య సేవలు వంటి అంశాలను సమీక్షించారు. అంతేకాకుండా వాహనాల్లో ఉన్న మెడికల్ ఎక్విప్‌మెంట్, ఆక్సిజన్ సిలిండర్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ తదితర పరికరాల పనితీరును పరిశీలించారు.
సమీక్ష అనంతరం జిల్లా వైద్యాధికారి మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో రోగి వద్దకు వేగంగా చేరుకొని వైద్య సహాయం అందించడం ద్వారా ఈ వాహనాలు అనేక ప్రాణాలను రక్షిస్తున్నాయని తెలిపారు. అలాగే డ్రైవర్లు, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (EMTలు) చూపిస్తున్న అప్రమత్తత ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ప్రత్యేకంగా వర్షాకాలంలో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను ముందే అంచనా వేసి, అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నందుకు జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సమ్రాట్, జిల్లా మేనేజర్ రాజశేఖర్ సహకారం, కృషిని డీఎంహెచ్‌ఓ ప్రశంసించారు. కఠిన పరిస్థితుల్లో కూడా సమన్వయంతో పనిచేసి అత్యవసర సేవలను అంతరాయం లేకుండా అందించడంలో వారి పాత్ర విశేషమని గుర్తించారు. ప్రజలు అత్యవసర సమయంలో ఈ సేవలను మరింత విశ్వసనీయంగా వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ 108, 102 వాహనాల హెల్ప్‌లైన్ నంబర్లను తెలుసుకొని ఉపయోగించుకోవాలని సూచించారు.