సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
22-01-2026
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికల్లో(Sircilla Municipal Elections) ప్రజల ఆశీర్వాదంతో గులాబీ జెండానే ఎగరబోతుందని మెజారిటీ వార్డులను గెలవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్, సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో ఆయన దిశానిర్దేశం చేశారు.సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని కేటీఆర్ సూచించారు. “మన పని మనమే చెప్పుకోవాలి..వేరే ఎవరు చెప్పారు” అని ఆయన స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత ఇక స్థానిక ఎన్నికలు ఉండవని, నేరుగా సాధారణ ఎన్నికలే ఉంటాయని పేర్కొంటూ, సిరిసిల్ల మున్సిపాలిటీ గెలవడమే కాదు అన్ని వార్డులను బీఆర్ఎస్ కైవసం చేసుకోవాల్సిందే అని స్పష్టంగా చెప్పారు.