పీవీ వర్ధంతి వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు
23-12-2025
మంథని,(విజయక్రాంతి): మాజీ ప్రధానమంత్రి, బహుముఖ ప్రజ్ఞాశాలి స్వర్గీయ పీవీ నరసింహా రావు వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) ఆ మహానాయకునికి మంగళవారం మంథని క్యాంప్ కార్యాలయంలో పీవీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణల దిశగా దేశాన్ని నడిపించిన దూరదృష్టి కలిగిన నేత పీవీ గారని, క్లిష్ట పరిస్థితుల్లో దేశాన్ని స్థిరత్వం వైపు తీసుకువెళ్లి, స్వేచ్ఛాయుత ఆర్థిక విధానాలకు బలమైన పునాది వేశారని గుర్తుచేశారు. బహు భాషావేత్తగా, పండితుడిగా, రచయితగా వారు అనేక రంగాల్లో భారత మేధస్సుకు ప్రతీకగా నిలిచారని అన్నారు. పీవీ దూరదృష్టి, సేవాభావం తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని, వారి ఆలోచనలు, ఆదర్శాలు మనందరికీ మార్గదర్శకంగా నిలవాలని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.