తల్లులారా దీవించండి!
31-01-2026
మేడారం/ములుగు, జనవరి 30 (విజయక్రాంతి): మేడారంలో సమ్మక్క సారలమ్మ వనదేవతల సన్నిధిలో భక్తిప్రవాహం వెల్లువిరిస్తోంది. శతాబ్దాల ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అరణ్య దేవతల గద్దెల వద్ద లక్షలాది మంది భక్తులు శుక్రవారం మొక్కులు తీర్చుకున్నారు. మనసు నిండా కృతజ్ఞతాభావంతో తిరుగుముఖం పడుతున్నారు. వనదేవతల స్పర్శతో పునీతమై, మేడారం జాతర పరిసరాలన్నీ అమ్మవార్ల నామస్మరణతో ప్రతిధ్వనిం చాయి. కోరిన కోరికలు నెరవేర్చినందుకు సమ్మక్క సారలమ్మ వనదేవతలకు కృతజ్ఞతగా లక్షల మంది భక్తులు పసుపు కుంకుమ (బండారి), వడిబియ్యం, బంగారం(బెల్లం), పూలు, చీరే, కొబ్బరికాయలు, వెండి తొట్టెలు, కానుకలు, నైవేద్యాలు అర్పించారు.