ఎన్నికల ప్రవర్తన నియమాలను తప్పనిసరిగా పాటించాలి
28-01-2026
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలోని మున్సిపాలిటీలలో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. జిల్లాలోని మహబూబ్నగర్, భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించి రేపటి నుండి నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో, నామినేషన్ దాఖలు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ పేర్కొన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, సెక్షన్ 144 అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. నామినేషన్ ప్రక్రియ మొత్తం ప్రశాంతంగా, నిబంధనల ప్రకారం జరిగేలా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటుందని ఆమె అన్నారు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులు మరియు వారి మద్దతుదారులు ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct)ను కచ్చితంగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.