calender_icon.png 3 December, 2025 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధిష్ఠానం చేతిలోనే డీకే భవితవ్యం !

03-12-2025 12:39:47 AM

  1. ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే ఆయన సీఎం 
  2. డీకేకు సీఎం పదవిపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు
  3. నాటు కోడితో సిద్ధరామయ్యకు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చిన శివకుమార్
  4. పార్టీలో ఐక్యతను చాటిచెప్పేందుకే ఈ భేటీ అన్న నేతలు
  5. 8న కాంగ్రెస్ ఎంపీల సమావేశం నిర్వహిస్తామని వెల్లడి

బెంగళూరు, డిసెంబర్ 2: కాంగ్రెస్ అధిష్ఠా నం ‘చేతి’లోనే డీకే శివకుమార్ భవితవ్యం ఉం దని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. అధిష్ఠానం ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే డీకే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. కర్ణాటక రాజకీయాల్లో నెలకొన్న నాయకత్వ పోరు ఊహాగానాల మధ్య ముఖ్యమంత్రి సిద్ధరామ య్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య కీలక భేటీ జరిగింది.

బెంగళూరులోని సదాశివనగర్‌లో ఉన్న డీకే శివకుమార్ నివాసానికి మంగళవారం సీఎంసిద్ధరామయ్య అల్పాహార విందుకు హాజరయ్యారు. శివకుమార్, ఆయన సోదరుడు, మాజీ ఎంపీ డీకే సురేశ్.. సిద్ధరామయ్యకు  సాదరంగా స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. 2028 ఎన్నికలు, స్థానిక ఎన్నికలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు.

అల్పాహారం అనంతరం అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, రైతుల సమస్యలు ఇతర విషయాలపై చర్చించినట్లు సిద్దరామయ్య తెలిపారు. ఈ విషయాల్లో చర్చలు జరపడానికి అధిష్ఠానం పిలిస్తే తాము ఢిల్లీకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.  ప్రభుత్వంలోని నేతలంతా ఐక్యంగా ఉన్నామని, రాష్ట్రాభివృద్ధికి కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. డిసెంబర్ 8న కాంగ్రె స్ ఎంపీల సమావేశం నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తున్నామని వెల్లడించారు. 

సిద్ధూకు నాటుకోడి విందు

సిద్ధరామయ్యకు అత్యంత ఇష్టమైన ‘నాటు కోడి’ వంటకాలను ఈ విందులో ప్రత్యేకంగా సిద్ధం చేసినట్లు శివకుమార్ ముందే వెల్లడించారు. అల్పాహారంలో నాటుకోడి కూర, ఇడ్లీ, ఉప్మా, దోశ, కాఫీ అస్వాదిస్తూ ప్రస్తుత పరిణామాలపై చర్చించుకున్నారు. ‘కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మేమిద్దరం కలిసికట్టుగా కృషి చేస్తాం’ అని ఆయన సోమవారం ట్వీట్ చేశారు.

సీఎం పదవి కోసం ఇద్దరు నేతల మధ్య పోటీ ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఇరువురు నేతలు ఇదివరకే స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. హనుమాన్ జయంతి సందర్భంగా డీకే శివకుమార్ చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. కష్టాలను తొలగించే మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.