తనికెళ్ళ గ్రామంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ తనిఖీ

26-09-2026 | 10:21pm

ఖమ్మం,(విజయక్రాంతి): జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. డి. రామారావు శనివారం తనికెళ్ళ గ్రామంలో విస్తృతంగా పర్యటించి, పల్లె దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ,పల్లె దవాఖానాలో అందుతున్న వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల అమలు, టీకా కార్యక్రమం (యూఐపీ) తదితర అంశాలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు నిరంతరం అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆదేశించారు.

అనంతరం ఎస్ సి  హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులకు అందుతున్న వసతులు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ముఖ్యంగా బాలికలకు హెచ్ పి వి టీకా ప్రాధాన్యతను వివరించి, సర్వైకల్ క్యాన్సర్ నివారణలో హెచ్ పి వి వ్యాక్సిన్‌ ఉపయోగకరంగా ఉంటుందని అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల కిచెన్ రూమ్‌ను పరిశీలించి పరిశుభ్రత, ఆహార తయారీ విధానాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా మండల ప్రజావాణిలో స్వీకరించిన గ్రీవెన్స్ పిటిషన్లపై ఏటిఆర్ ను వెంటనే సమర్పించాలని సిబ్బందిని ఆదేశించారు. కుక్క కాటు, నెలవారి నివేదికలను,నిర్ణీత సమయంలో  జిల్లా ఆఫీసులో సమర్పించాలని సూచించారు. అవసరమైన సందర్భాల్లో గర్భిణులను సకాలంలో  గవర్నమెంట్  ఆసుపత్రికి రిఫర్ చేయాలని, సూచించారు,ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాల లక్ష్యాలను సాధించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ డా. డి. రామారావు సూచించారు.

మరిన్ని వార్తలు