విమోచన వీరుల త్యాగాలను మరువొద్దు
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన వారోత్సవాల్లో(Telangana Liberation Week Celebrations) భాగంగా సుబ్లేడు గ్రామంలో తొలితరం పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హనుమకొండ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన విమోచన దినమని అన్నారు.
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కలంతో పోరాడిన షోయబుల్లాఖాన్ త్యాగాన్ని, తెలంగాణ విముక్తి వీరుల పోరాటాన్ని చరిత్ర నుంచి చెరిపేయలేరన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంలో వెనుకాడుతున్నాయని విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించి అమరవీరుల త్యాగాలను గౌరవించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.