ఈఎస్ఐ ఆసుపత్రికి తాళాలు!

25-09-2026 | 12:42pm

15 నెలలుగా అద్దె చెల్లింపులేదని యజమాని చర్య

వైద్య సేవలకు అంతరాయం.. కార్మికుల్లో ఆందోళన

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) బూర్గంపాడు మండలం సారపాకలోని ఈఎస్ఐ ఆసుపత్రి(ESI hospital)కి అద్దె బకాయిల వ్యవహారం కారణంగా తాళాలు పడినట్లు సమాచారం. 15 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో భవన యజమాని ఆసుపత్రికి తాళాలు వేసినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో కార్మికులు, వారి కుటుంబాలకు అందాల్సిన వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. నెలల తరబడి అద్దె బకాయిలు పేరుకుపోయే వరకు సంబంధిత అధికారులు ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.

బకాయిల సమస్యను ముందుగానే పరిష్కరించకుండా ఆసుపత్రికి తాళాలు పడే పరిస్థితి ఎందుకు వచ్చిందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. అత్యవసర వైద్యం అవసరమైన సమయంలో ఆసుపత్రి మూసివేయడంతో రోగులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు స్పందించి అద్దె బకాయిలను వెంటనే పరిష్కరించి, ఈఎస్ఐ ఆసుపత్రిలో వైద్య సేవలను పునరుద్ధరించాలని కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ వైద్య సేవలు అందించే ఆసుపత్రికే తాళాలు పడటంపై సారపాకలో చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు