రైతు బజార్.. సామాన్యుడు బేజార్
సూచిక బోర్డు, అమ్మకం ధరల మధ్య తేడా
దళారుల ఇష్టారాజ్యం
వినియోగదారులకు ఆర్థిక నష్టం
పట్టించుకోని ఎస్టేట్ ఆఫీసర్
సిద్దిపేట క్రైం, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): రైతులకు గిట్టుబాటు ధర, సామాన్య ప్రజలకు సరసమైన ధరలకే నాణ్యమైన కూరగాయలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన రైతుబజార్(Rythu Bazar)లో అధికారుల పర్యవేక్షణ కొరవడింది. రైతు బజార్ లో సూచిక బోర్డుపై ఉన్న నిర్ణీత ధరల కన్నా ఎక్కువ ధరకు దళారులు, కొందరు రైతులు కూరగాయలు విక్రయిస్తున్నారు. దాంతో రైతుబజార్కు వచ్చే వినియోగదారులపై ఆర్థిక భారం పడుతోంది.
సిద్దిపేట జిల్లా(Siddipet District)లోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు తాము పండించిన కూరగాయ పంటలను అమ్ముకోవడానికి నిత్యం సిద్దిపేటలోని రైతుబజార్ కు వస్తుంటారు. పొలం నుంచి తెచ్చిన పంటను ఎంతో కొంతకు అమ్ముకొని వెళ్లిపోతుంటారు. రైతుబజార్లలో రైతుల పేరిట తిష్ట వేసిన దళారులు వాటిని కొనుగోలు చేసి వినియోగదారులను దగా చేస్తున్నారు.
రైతులు తీసుకొచ్చిన కూరగాయలను రైతుబజార్ బయటే కొనుగోలు చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సాధారణంగా వ్యవసాయ మార్కెటింగ్ అధికారులు కూరగాయల నాణ్యతను పరిశీలించి, ధరలు నిర్ణయిస్తారు. హోల్సేల్ మార్కెట్లో కూరగాయల ధరలకు అనుగుణంగా ఏ రకం ఎంతకు అమ్మాలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ నిర్ణయిస్తుంది. ఆ ధరలను ఏ రోజుకారోజు రైతుబజార్ లోని ఎస్టేట్ అధికారికి పంపుతోంది. అయితే ఇది రైతుబజార్ లో అమలు కావడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దళారులు కుమ్మకై అధిక ధరలకు విక్రయాలు కొనసాగిస్తున్నా ఎస్టేట్ అధికారి పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సూచిక బోర్డుపైనిర్ణయించిన ధరల కంటే కిలోకు రూ.10 నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ధరల విషయమై ప్రశ్నిస్తే... దుర్భాషలాడుతూ అవమానిస్తున్నారని వినియోగదారులు వాపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఎస్టేట్ అధికారి అందుబాటులో ఉండడం లేదని ఆరోపిస్తున్నారు. ఇకనుంచైనా సంబంధిత అధికారులు రైతుబజార్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సూచిక బోర్డుపై ధరల ప్రకారం విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతు న్నారు. అధిక ధరలకు విక్రయాలు చేస్తున్న వ్యాపారులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.