తలపుల తలుపులు తెరిచే ‘తటిల్లతలు’
తెలుగు సాహిత్యంలోని (Telugu Literature)అనేక ప్రక్రియల్లో వివిధ అంశాల్లో కవితల్ని మనం చదువుతూ ఉంటాం. ఒక్కొక్క కవిదీ ఒక్కో బాణి. చాలా తక్కువ పదాల కూర్పు తో లోతైన భావాలను సంధించే సంపుటాలు కాస్త అరుదుగానే ఉంటాయి. ఒక ప్రక్రియకు కట్టుబడక, పట్టుబడక స్వతంత్ర ప్రతిపత్తితో పదాలు మినీ కవితలుగా అల్లి మనలోని తాత్విక తలపుల్ని తట్టి తలుపులు తెరిచేది ‘తటిల్లతలు’ కవితా సంపుటి.
‘నేనేదో పోగొట్టుకున్నానని తెలిసి వెనక్కి తిరిగి చూసా... వెర్రిగా వెక్కిరించింది కాలం..!’
అంటాడు ‘తటిల్లతలు’లో కవి కె.ఆనందాచారి. కాల గమనంలో ఏదీ ఆగదు అనే తాత్వికత ఈ పంక్తుల్లో కనిపిస్తుంది. ఈ కవితా సంపుటిలో తాత్విక చింతనలు, కొస మెరుపులు, పద చిత్రాల వైచిత్రి మెండుగా కనిపిస్తాయి. ఈ పుస్తకంలో కొన్ని కవితలు చదువుతూ ఉంటే.. మనసు ఆలోచించడం మొదలుపెడుతుంది. ఇంకొన్ని కవితలు చదివినప్పుడు హృదయం స్పందించడం మొదలు పెడుతుంది. మరికొన్ని కవితలు మాత్రం చదివిన వెంటనే మెరుపులా పంచేంద్రియాలనూ తాకుతాయి. ఆ తర్వాత చాలాసేపు అవి మనసులో వెలుగుతుంటాయి. మెరుపు కవితల సమాహారమే ఆనందాచారి రచించిన ‘తటిల్లతలు’.
‘తటిల్లతలు’ అంటే మెరుపు తీగలు. సంపుటి శీర్షిక ఎంతో మృదువుగా ఉన్నా అందులోని కవిత్వం గాఢంగా ఉంటుంది. ఇది ఒకే ఒక సంప్రదాయ కవితా రూపంలో ఉండదు. చిన్న కవితకు ప్రత్యేకంగా ఎలా చెప్పుకోవచ్చో రచయిత వెతికాడు. ఈ ప్రయత్నమే రచయిత సృజనాత్మక ప్రయా ణం. రచయిత దీనిని ‘ఫ్లాష్ పోయెట్రీ’ అని పిలవడంలో అదే కారణం ఉంది.
వేగంగా మారుతున్న నేటి జీవనగమనంలో పాఠకుడికి సమయం తక్కువ. అయితే అనుభూతులు మాత్రం తగ్గిపోవు. ఆ లోటును భర్తీ చేసేందుకు కొంతమంది కొద్ది పదాల్లో గాఢమైన భావాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఆనందాచారి ఈ ప్రయత్నాన్ని స్వీకరించారు. వాక్యాలు పెద్దవిగా ఉండకపోయినా, భావం లోతుగా ఉండేలా రచించారు. ‘తటిల్లతలు’లోని కవితలు ఒక్క భావానికి, ఒక్క వస్తువుకే పరిమి తం కావు. జీవితం, సమా జం, మనిషి మనస్తత్వం, సంబంధాలు, ప్రేమ, సమకాలీనత, ప్రకృతి, ఆలోచన వంటి అనేక పార్శ్వాలు ఈ చిన్న కవితల్లో కనిపిస్తాయి.
ముఖ్యంగా చిన్న కవితకు ముగింపును ఒక మెరుపు మలుపుగా ఇవ్వడం రచయిత శైలిలో ప్రత్యేకత. చదువుతున్నప్పుడు సాధారణంగా అనిపించిన భావం చివరి పదం దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా కొత్త అర్థాన్ని పొందుతుంది.
‘అసలైతే దుఃఖం ఆనందం వేరు వేరు కానీ...
దుఃఖంలోనూ ‘ఆనందం’ నేను..!’ అంటాడు ఓ చోట కవి.
మరో కవితలో ప్రస్తుత లోకం ఎలావుందో..ప్రేమ గురించి తేటతెల్లం చేశాడు.
‘ఈ ప్రపంచాన ప్రేమ ఎప్పుడూ ఓడి పోతూనే ఉంది. ఎందుకంటే.. హృదయ రహిత లోకం ఇది’ అంటాడు గాఢమైన భావాల పొందికతో..!
ఇంకొక విశేషం.. తెలుగు కవితకు పక్కనే ఆంగ్ల అనువాదాన్ని అందించడం. పి. శ్రీనివాస్ గౌడ్ చేసిన అనువాదం ద్వారా ఈ మెరుపు భావాలు మరో భాషలోనూ పాఠకుడిని చేరే అవకాశం పొందాయి. ఇది కేవ లం అనువాద ప్రయోగం కాదు.. తెలుగు భావప్రపంచాన్ని ఆంగ్ల పాఠకుడి ముందు కు తీసుకెళ్లే ఒక సాహిత్య వారధి. రెండు భాషలను పక్కపక్కన ఉంచడం వల్ల మూలకవితలోని పదబంధం, అనువాదంలోని భావసామ్యం రెండింటినీ ఆస్వాదించే అవకాశం పాఠకుడికి లభిస్తుంది.
మనుషుల మధ్య మాటల కరువును ఎంత హృద్యంగా చెప్పారో కవి ఆనందాచారి చూడండి..
‘ఎవరో ఒకరు పలుకరిస్తారని ఎదురు చూస్తుంటాను పనులు కప్పుకున్న పలుకులు తప్ప మనుషులతో వేరే మాటలే లేవు..!’ అని ఒక చోట..
‘ఏదైనా ఒకటి చెప్పు పనేదైనా చేయి లేదంటే రాస్తూనే ఉండు నువ్వు సజీవంగా ఉన్నందుకు గుర్తులవి..!’
అంటాడు ఇంకో చోట కవి. మనిషి సజీవంగా ఉన్నాడనటానికి సాక్ష్యంగా అక్షరా లను కూర్చాడు.
‘పలకరించానంతే వేల జ్ఞాపకాల మూటను విప్పి పోసింది మనసు వాటిలో కన్నీటి జ్ఞాపకమే తీయగా తాకింది..!’ అంటూ అంతర్లీన ఆటుపోట్లనూ ఆవిష్కరించాడు.
‘తటిల్లతలు’లోని కవితలన్నీ చదివాక హృదయంలో కొన్ని గదులు తేలిక పడతాయి.. మరికొన్ని బరువెక్కుతాయి. ఏదో వెలితిని కొన్ని కవితా వరుసలు భర్తీ చేస్తూ ఉంటాయి. ఇంకా మనలో పూరించుకోకుండా మిగిలిన మమతాను రాగాలను బతికున్నప్పుడే ప్రోది చేసుకోవాలన్న భావనను చెప్పకనే చెప్పినట్టు అక్షరాలను హృదయానికి చెలిమి దారంతో కట్టేస్తాడు కవి ఆనందాచారి. కార్టూనిస్ట్ భాస్కర్ చిత్రాలు సైతం కవితలకు మరో ఎసర్ట్.
ఆధునిక సాహిత్యంలో కవిత్వం కేవలం ఛందస్సు, అలంకారం, ప్రాసలకు పరిమితం కాదు. కొత్త అనుభూతిని కొత్త రూపంలో చెప్పడం, పాఠకుడి ఆలోచనకు స్థానం ఇవ్వడం, ఒక చిన్న దృశ్యంతో పెద్ద జీవిత సత్యాన్ని చూపించడం కూడా ఆధునిక కవిత్వ లక్షణాలు. ఈ దిశలో ‘తటిల్ల తలు’ ఒక ప్రయోగాత్మక అడుగు. కవిత చిన్నదే కావచ్చు.. కానీ దానికి వెనుక ఉన్న ఆలోచన పెద్దదై మనల్ని కట్టి పడేస్తుంది. ప దాలు తక్కువే కావచ్చు.. కానీ వాటి ప్రభా వం ఎక్కువ కాలం ఉంటాయన్నది సత్యం. అదే ‘తటిల్లతలు’లోని అసలు తత్వం.
ఆనందాచారి కవిత్వంలో మెరుపు ఉంది, మరుపు లేదు. పదాలు తక్కువగా ఉన్నా యి.. భావాల విస్తృతి మాత్రం తగ్గలేదు. సంక్షిప్తత ఉంది.. సంకుచితత్వం లేదు. అందుకే ‘తటిల్లతలు’ను కేవలం మినీ కవితల సంకలనంగా చూడకూడదు. చిన్న కవితకు ఒక స్వతంత్ర సృజనాత్మక శక్తిని అందించాలని ప్రయత్నంగా చూడాలి.