నిబంధనలకు తూట్లు!?
- అనుమతులు ఒకలా... నిర్మాణాలు మరోలా
- సీఎంసీ ఆదేశాలు నిజాంపేట్ సర్కిల్‌కు వర్తించవా..?
- జీపీఆర్ లేఅవుట్‌లో నిబంధనలకు నీళ్లు
- బాచుపల్లిలో రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ నిర్మాణం
- అక్రమ నిర్మాణాలపై చర్యలు లేనట్టేనా?
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్(Nizampet Circle) పరిధిలోని అక్రమ నిర్మాణదారులకు(Illegal construction workers) అడ్డు అదుపూ లేకుండా పోతుంది. కొంత వరకే అనుమతులు తీసుకొని బహుళ అంతస్తులు నిర్మిస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని కీలుబొమ్మలా ఆడిస్తున్నారు. మరికొందరు నిర్మాణదారులు అయితే రెసిడెన్షియల్ అనుమతులు(Residential permissions) తీసుకొని కమర్షియల్ భవనాలుగా(Commercial buildings) నిర్మిస్తూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు.
అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నప్పటికి చర్యలు మాత్రం నోటీసులకే(Notices) పరిమితం అయ్యాయి.అక్రమ నిర్మాణాలపై సిఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేస్తునప్పటికి సర్కిల్ అధికారులు మాత్రం అవేమి పట్టనట్టుగా వ్యవహరించడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.చర్యలు తీసుకోవాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులే అక్రమ నిర్మాణాలకు సహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి
జీపీఆర్ లేఅవుట్‌లో నిబంధనలకు తూట్లు..
నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని జీపీఆర్ లేఅవుట్ లోని అక్రమ నిర్మాణాలు, భారీ షెడ్లు నిర్మిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఓ నిర్మాణదారుడు భవన నిర్మాణానికి అనుమతులు కొంత వరకే తీసుకొని అక్రమంగా బహుళ అంతస్తులు నిర్మిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదులు వస్తున్నప్పటికి నోటీసులతో సరిపెడుతున్నారే తప్ప ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టౌన్ ప్లానింగ్ అధికారులకు సెటిల్మెంట్ అయినందుకే నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్నారని స్థానికులు విమర్శలు గుప్పిస్తున్నారు.
బాచుపల్లిలో రెసిడెన్షియల్ అనుమతులతో కమర్షియల్ నిర్మాణం..
బాచుపల్లి లోని మల్లంపేట్ నుండి బాచుపల్లి వచ్చే దారిలో ఓ నిర్మాణదారుడు రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్ భవనంగా నిర్మిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నాడు. అక్రమ నిర్మాణంపై నోటీసుల సమయం పూర్తయినా కూడా చర్యలు తీసుకోవడం లో టౌన్ ప్లానింగ్ అధికారులు విఫలమవుతున్నారు.టౌన్ ప్లానింగ్ అధికారులే అక్రమ నిర్మాణాలకు ఊపిరి పోస్తూ అందిన కాడికి దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఇప్పటికైనా నిర్మాణదారులు తీసుకున్న అనుమతులకు సంబంధం లేకుండా నిర్మిస్తున్న భారీ నిర్మాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకొని, నిబంధనలను ఉల్లంఘిస్తున్న నిర్మాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.