జుక్కల్ నియోజకవర్గంలో విచ్చలవిడిగా ఆహార కల్తీ

11-09-2026 | 08:41am

పట్టించుకోని ఫుడ్ సేఫ్టీ, తూనిక కొలతల అధికారులు

ప్రజారోగ్యంతో చెలగాటంఆడుతున్న వ్యాపారులు

నిజాంసాగర్ సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా  జుక్కల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఆహార కల్తీ(Food adulteration) పరాకాష్ఠకు చేరింది. నిత్యం పౌరులు వినియోగించే ఆహార పదార్థాల్లో నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా క్షీణిస్తున్నా, పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం కనీసం ఆటువైపు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిట్లం, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ తదితర మండల కేంద్రాల్లోని వ్యాపార సముదాయాల్లో కల్తీ వ్యాపారం(Adulteration business) బహిరంగంగా సాగుతున్నా సంబంధిత శాఖాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

నియోజకవర్గ పరిధిలోని హోటళ్లు, బేకరీలు, కిరాణా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఏళ్లు గడుస్తోంది. అధికారుల నిర్లక్ష్యాన్నే ఆసరాగా చేసుకుని కొందరు వ్యాపారులు(Traders) కల్తీకి పాల్పడుతున్నారు. పాలు, నూనె, కారం, పసుపులతో పాటు స్వీట్లు, తినుబండారాల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకరమైన రసాయన రంగులను ఉపయోగిస్తున్నారు. అనేక దుకాణాల్లో కాలం చెల్లిన (ఎక్స్‌పైరీ) ఆహార పదార్థాలను యథేచ్ఛగా విక్రయిస్తున్నారు. కల్తీ ఆహారం తిని ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు కడుపునొప్పి, ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ట్రిక్ వంటి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు.

మార్కెట్‌లో లభించే ప్రతీ వస్తువులో కల్తీ భయం పట్టుకుంది. అధిక ధరకు విక్రయించే చిరు ధాన్యాలు(Millets), డ్రై ఫ్రూట్స్ కూడా నాసిరకంగానే ప్రజలకుఅండగడుతున్నారు. మహారాష్ట్ర,కర్ణాటక నుండి కల్తీ సరుకులు,  జుక్కల్ నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల గుండా దొంగచాటుగా ఎలాంటి అనుమతులు లేకుండా కల్తీ ఆహార సరుకులు రవాణా చేస్తున్న అధికారులకు పట్టనట్లు వ్యవహారిస్తున్నారు. పత్తాలేని తూనికల కొలతలు అధికారులు, ప్రతినిత్యం కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, కూరగాయల బజార్లో  తూకంలో మోసాలు జరుగుతున్న  అవేమి తమకు పట్టనట్టుగా తూనికల కొలితల అధికారులు వ్యవహరిస్తున్నారు. 

ఇప్పటికే అధిక ధరలతో విసిగెత్తిపోతున్న వినియోగదారులకు  తూకంలో మోసాలతో నష్టపోతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ తూకంలో మోసాలకు పాల్పడే వారిపై కేసు నమోదు చేయాల్సిన అధికారులు నిమ్మకు నెరెత్తినట్టుగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని, జుక్కల్ నియోజకవర్గంలో ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ బృందాలతో(food safety teams) దాడులు నిర్వహించాలని, కల్తీ రాయుళ్లపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు