గాంధీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకం: మాజీ ఎంపీ నామ

01-10-2026 | 07:26pm

సత్యం, అహింస, శాంతి విలువలను ఆచరించాలి : మాజీ ఎంపీ నామ

ఖమ్మం,(విజయక్రాంతి): మహాత్మా గాంధీజీ(Mahatma Gandhi) చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో అవసరమని బీఆర్ఎస్ మాజీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. అక్టోబర్‌ 2న మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమం(Country freedom movement)లో గాంధీజీ పోషించిన పాత్ర చిరస్మరణీయమని నామ గుర్తుచేశారు. అహింస, సత్యాగ్రహం, సహనం వంటి ఆయుధాలతో ప్రజలను ఏకం చేసి బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా మహోద్యమాన్ని నడిపించిన మహనీయుడని పేర్కొన్నారు.

గాంధీజీ జీవితం, ఆయన ఆలోచనా విధానం ప్రతి తరానికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు.  సమాజంలోని అణగారిన వర్గాలకు న్యాయం జరగాలని, ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభించాలని గాంధీజీ ఆకాంక్షించారని నామ ప్రస్తావించారు. గ్రామీణ భారతం అభివృద్ధి చెందితేనే దేశం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందనే గాంధీజీ ఆలోచనలను గుర్తుచేశారు. గ్రామ స్వరాజ్యం, స్వావలంబన, సామాజిక సమానత్వం వంటి ఆయన ఆశయాలు నేటికీ ప్రాధాన్యత కలిగి ఉన్నాయని వివరించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలోనూ శాంతియుత ప్రజాస్వామ్య పోరాటం ద్వారా రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘంగా పోరాడారని నామ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు తీసుకెళ్లి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించారని తెలిపారు.  కేసీఆర్‌ పాలనలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారని నామ గుర్తుచేశారు.

పల్లె ప్రగతి, గ్రామ పంచాయతీల బలోపేతం, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం వంటి చర్యల ద్వారా గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యం కల్పించారని వివరించారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల అభివృద్ధికి కృషి చేయడం గాంధీజీ గ్రామ స్వరాజ్య ఆలోచనలకు అనుగుణంగా ఉందని తెలిపారు.  మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని నామ కోరారు.

మరిన్ని వార్తలు