“పేద పిల్లలను చూసి చలించిపోయా”
సంచార జాతి పేద పిల్లల కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన
“బడి కావాలని అడిగిన పేద పిల్లలను చూసి చలించిపోయా”
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఫరూఖ్‌నగర్ మండలం హాజిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సిండికేట్ కాలనీలో(Syndicate Colony) సంచార జాతుల పిల్లల కోసం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(Shadnagar MLA Veerlapally Shankar) శంకుస్థాపన చేశారు. దాతల సహకారంతో పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే తన లక్ష్యమన్నారు. “పేద పిల్లలు బడి కావాలని నన్ను అడిగినప్పుడు ఎంతో చలించిపోయాను. వారికి చదువుకునే అవకాశం కల్పించడం మనందరి బాధ్యత. అందుకే వెంటనే స్పందించి పాఠశాల నిర్మాణానికి చర్యలు చేపట్టాం” అని తెలిపారు.
పేద విద్యార్థుల చదువుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. విద్యా రంగానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. దాతలు ముందుకు వచ్చి పేద పిల్లల విద్యకు అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు కూడా పేద విద్యార్థులకు తమ వంతు సహకారం అందించాలని, ముఖ్యంగా విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్‌లు అందజేయాలని ఎమ్మెల్యే శంకర్ స్థానిక మీడియా (Local media)సీనియర్ ప్రతినిధి లట్టుపల్లి మోహన్ రెడ్డి ద్వారా కోరారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, గ్రామ సర్పంచ్ కుమార్, మండల విద్యాధికారి మనోహర్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్,పాటు అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.