ఖమ్మం ఘటనపై గోద్రెజ్ ఆగ్రోవెట్ ప్రకటన

01-10-2026 | 09:05pm

హైదరాబాద్: ఖమ్మం జిల్లా, అంజనాపురం గ్రామంలోని గోద్రెజ్ ఆగ్రోవెట్ కు చెందిన ఆయిల్ పామ్ ప్లాంట్‌లో ఒక మురుగునీటి ట్యాంకుకు సంబంధించి జరిగిన సంఘటనను గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్(Godrej Agrovet Limited) ధృవీకరించింది. ఆ మురుగునీరు, ప్లాంట్ ప్రాంగణంలోనే అదుపులోకి వచ్చిందని, ప్లాంట్ పరిధి దాటి దాని ప్రభావం ఏమీ లేదని తెలిపింది. సోమవారం నాడు ప్లాంట్‌లోని సుమారు 30,000 లీటర్ల సామర్థ్యం గల మురుగునీటి ట్యాంకు ప్రభావితం కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

స్థానిక సమాచారం ప్రకారం, మురుగునీరు పక్కనే ఉన్న భూమిలోకి వ్యాపించింది.  అది మరింత వ్యాపించకుండా నిరోధించడానికి ఫ్యాక్టరీ సిబ్బంది జేసీబీలను ఉపయోగించి మట్టి కట్టలు నిర్మించారు. పర్యావరణానికి, కార్మికుల ఆరోగ్యానికి ఏమైనా ప్రమాదం ఉందో లేదో అంచనా వేయాలని స్థానికులు అధికారులను కోరారు. కాలుష్య నియంత్రణ శాఖ అధికారులు నిర్వహించే తనిఖీలు, వ్యర్ధ జలాల నమూనాలను  పరీక్షల చేయటం  ద్వారా వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ అధికారి ఒకరు మాట్లాడుతూ, “ఖమ్మంలోని మా సంస్థకు చెందిన ప్లాంట్‌లో జరిగిన ఘటనపై మాకు సమాచారం ఉంది. ఈ ఘటన గురించి సమాచారం అందిన వెంటనే, మా ఉద్యోగుల భద్రతను నిర్ధారించడం, అలాగే వ్యర్థ ద్రవాలు (ఎఫ్లూయెంట్) మా ప్రాంగణం లోపలే పరిమితమయ్యేలా చర్యలు తీసుకోవడం మా తక్షణ ప్రాధాన్యతగా ఉంది.

ఈ విషయంలో మేము పూర్తిగా విజయవంతమయ్యాము. ప్లాంట్ ప్రాంగణం వెలుపల ఎలాంటి ప్రభావమూ చోటుచేసుకోలేదు. ప్రస్తుతం సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నాము. ఈ ఘటనకు సంబంధించి, సంబంధిత స్థానిక అధికారులందరికీ సమాచారం అందించటం జరిగినది. అవసరమైన మేరకు వారికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు