7 September, 2026 | 8:25 AM

ఆరోగ్య కేంద్రాలకు అనారోగ్యం!

07-09-2026 | 05:20am
  1. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డ్యూటీ గంట.. మిగతా టైమంతా స్వంత ఆస్పత్రుల్లోనే
  2. కంటి తుడుపుగా బీపీ, పల్స్ చెకప్ 
  3. సాదాసీదా మందులతోనే సరిపెడుతున్న వైనం
  4. వేధిస్తున్న సిబ్బంది, వైద్యులు, మందుల కొరత 
  5. కుదేలవుతున్న ప్రభుత్వ వైద్యం
  6. కీలక సేవలకు రెఫర్లు  

నాగర్ కర్నూల్/కల్వకుర్తి/అచ్చంపేట/కొల్లాపూర్ రూరల్/వెల్డండ సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా(Nagarkurnool District)లో నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షగా మారింది. గ్రామీణ ప్రాంతంలోని గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, పల్లె దావఖన, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వైద్యులు, సిబ్బంది, మందులు కొరతతో అనారోగ్యం పట్టుకుంది.

డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి ప్రాణాంతక సీజనల్ వ్యాధులు విధులంబిస్తున్న ఈ తరుణంలో మరికొంత మంది వైద్యులు రాజకీయ అధికార బలంతో డుమ్మా కొట్టి సొంత ఆస్పత్రులను పెంపు చేసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి. చిన్నచిన్న కేసులను కూడా జిల్లా కేంద్రం, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు రిఫర్ చేసి చేతులు దులిపేసుకుంటున్న పరిస్థితి నెలకొంది.

అయినా జిల్లా వైద్యాధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం వెనక సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిత్యం ఓపి సేవలు అందించాల్సి ఉన్నా కంటి తుడుపుగా బిపి, పల్స్ చెకప్ చేసి సాదాసీదా మందులు చేతికిచ్చి పంపుతున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. టెస్టుల కొరకు శాంపిల్ సేకరించి టీ హబ్ పంపడంతో వారాల తరబడి రిపోర్టర్లు అందడం లేదని ఫలితంగా వైద్యం అందించేందుకు కూడా సమస్యగా మారిందని కొందరు వైద్యులు చెప్తున్నారు. 

డుమ్మా వైద్యులకు రాజకీయ అండ

రాజకీయ అధికార బలంతో కొంతమంది వైద్యాధికారులు చుట్టపు చూపుగా గంట పాటు వచ్చి హాజరు నమోదు అనంతరం డుమ్మా కొడుతున్నారని ఆయా ప్రాంత రోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా అయినప్పటికీ రాజకీయ నేతలు కూడా డ్యూటీకి డుమ్మా కొట్టి సొంత ఆస్పత్రిలో పేద రోగుల నడ్డి విరుస్తున్న వైద్యులను వెనకేసుకు రావడం ప్రైవేట్ వైద్యాన్ని ప్రోత్సహించడమే అవుతోందని జిల్లా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, వంటి ఏరియా ఆసుపత్రుల్లో కూడా ఆరోపణ వైద్యులు వసతులు కారణంగా నిరుపేదలకు ప్రభుత్వ వైద్యం అందడం లేదని ఆరోపిస్తున్నారు. నల్లమల ప్రాంత ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఏరియా, ప్రాథమిక ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలు, వైద్యులపై అదనపు పనిభారం సమస్యగా మారుతున్నాయి. పేరుకు పెద్దాసుపత్రులుగా ఉన్నా.. అనేక కీలక వైద్య సేవలు అందక ప్రజలు నాగర్ కర్నూల్, వనపర్తి, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.

అచ్చంపేటలో రెఫర్లే..!

నల్లమల ప్రాంతానికి ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న అచ్చంపేట వంద పడకల ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్య సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. కొందరు వైద్యులకు ప్రైవేట్ ప్రాక్టీస్ ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలపై ప్రభావం పడుతోందని రోగులు ఆరోపిస్తున్నారు. కొంతమంది రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారని, కొన్ని మందులను బయట మెడికల్ షాపుల్లో కొనుగోలు చేయాలని రాస్తున్నారని వారు పేర్కొంటున్నారు. అయితే ఆసుపత్రికి ప్రభుత్వం నుంచి అవసరమైన మందులు సకాలంలో వస్తున్నాయని ఫార్మసిస్ట్ తెలిపారు. ప్రసవాలు, ఇతర అత్యవసర సేవలకు సంబంధించి తరచూ జిల్లా కేంద్రం హైదరాబాద్లోని ఉన్నత ఆసుపత్రులకు రిఫర్ చేస్తున్నారని రోగులు వాపోతున్నారు.

కొల్లాపూర్‌లో వసతులు ఎక్కడ?

కొల్లాపూర్ ఏరియా ఆసుపత్రికి కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ మండలాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు వస్తున్నారు. అయితే కీలకమైన కొన్ని పరీక్షలు, ముఖ్యంగా గుండె సంబంధిత నిర్ధారణ సేవలు అందుబాటులో లేకపోవడంతో రోగులు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని నాగర్ కర్నూల్, వనపర్తికి వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంద పడకల కొత్త ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మెరుగైన వైద్య సేవలు లభిస్తాయని ప్రజలు ఆశిస్తున్నారు. అయితే భవనం సిద్ధమైనప్పటికీ ప్రారంభానికి నోచుకోకపోవడంపై స్థానికుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆసుపత్రిని త్వరగా ప్రారంభించి అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు