అసెంబ్లీ వద్ద హైడ్రామా

08-09-2026 | 05:25am
  1. నల్ల టీషర్టులతో బీఆర్‌ఎస్ సభ్యుల నిరసన
  2. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట
  3. టీషర్టు విప్పి హరీశ్‌రావు ఆందోళన 
  4. కేటీఆర్ సహా పలువురికి గాయాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల(Telangana Assembly Monsoon Sessions) తొలిరోజే బీఆర్‌ఎస్ సభ్యుల(BRS members) ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తొలుత ఆ పార్టీ సభ్యులు గన్‌పార్క్(Gun Park) వద్దకు వెళ్లారు. తెలంగాణ అమరవీరుల(Telangana Martyrs)కు నివాళులర్పించారు. అనంత రం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) పాలనలో విఫలమైందంటూ నల్ల టీషర్టులు ధరించి ‘వెయ్యి రోజుల పాలన.. నిష్ఫలం’, ‘హామీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీ(Assembly) వైపు కదిలారు. మహిళా ప్రజాప్రతినిధులు(Public representatives) నల్ల చీరలు ధరించి నిరసనలో పాల్గొన్నారు.

అసెంబ్లీ గేటు వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ సభ్యులను పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థి తి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ప్లకార్డు లు, నల్ల టీషర్టులతో అసెంబ్లీలోకి అనుమతించబోమని పోలీసులు అడ్డుకున్నారు. అం దుకు బీఆర్‌ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య వాగ్వాదం మొదలై తోపులాటకు దారితీసింది.  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.

పోలీసులు వారిని అడ్డుకున్నారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. నల్ల టీషర్టులు విప్పి లోపలికి వెళ్లాలని పోలీసులు సూచించారు. పోలీసులపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్‌గాంధీ టీషర్ట్(Rahul Gandhi T shirt) వేసుకుని పార్లమెంటుకు వెళ్తే తప్పులేదు కానీ, తాము నల్ల టీషర్ట్ వేసుకుని అసెంబ్లీకి వస్తే ఎందుకు అభ్యంతరమని ప్రశ్నించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో కేటీఆర్ చేతికి గాయమైంది. జగదీశ్‌రెడ్డికి కూడా స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసుల గోళ్లు గీసుకుపోవడంతో చేతికి గాయాలయ్యాయని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అతిగా వ్యవహరించొద్దని పోలీసులను హెచ్చరించారు. తమను అసెంబ్లీలోకి రానివ్వొద్దని స్పీకర్ ఆదేశించారా? అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. అలాంటి ఆదేశాలుంటే చూపించాలని డిమాండ్ చేశారు. నల్ల టీషర్టులు వేసుకుని అసెంబ్లీకి రావడం తప్పా అని నిలదీశారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని, అన్నింటినీ గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు.

మహిళా ప్రజాప్రతినిధుల పట్ల కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారని బీఆర్‌ఎస్ సభ్యులు ఆరోపించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి తన చీరను పోలీసులు లాగారని ఆరోపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్దే మహిళా ప్రజాప్రతినిధులకు రక్షణ లేకపోతే బయట ఉన్న మహిళలకు ప్రభుత్వం ఏం రక్షణ కల్పిస్తుందని ప్రశ్నించారు. ఘటనపై ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

కేటీఆర్, హరీశ్‌రావు అరెస్ట్

అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన కేటీఆర్, హరీశ్‌రావు సహా పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  సమీప పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేటీఆర్, ఇతర బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులకు చికిత్స అందించారు. బీఆర్‌ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. 

ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు

పోలీసులు బీఆర్‌ఎస్ ప్రతినిధులను అడ్డుకున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారు. పోలీసులను ఉద్దేశించి ‘ప్యాంటు లాగుతావెందుకు? ప్యాంట్ లాగమని స్పీకర్‌గాడు చెప్పిండా నీకు? ఏ లం..కొడుకు మీకు అధికారమిచ్చింది? ప్యాంటు లాగేదెవడ్రా నువ్వు?’ అని అనుచితంగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు