పెళ్లి చేసుకోకుండానే తల్లిని అవుతా!
చిత్ర పరిశ్రమ(Film industry)లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్(Star heroine Shruti Haasan) మరోసారి తన బోల్డ్, స్పష్టమైన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచింది. సాధారణంగా వ్యక్తిగత విషయాలపై చాలా ఓపెన్‌గా మాట్లాడే శ్రుతి.. తాజాగా మాతృత్వం(Motherhood), పెళ్లి(Wedding), తన ఆరోగ్య సమస్యల(Health issues)పై చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ షోలో పాల్గొన్న శ్రుతి హాసన్ తన మనసులోని మాటను పంచుకున్నది. ప్రస్తుతం 40 ఏళ్ల వయసులో ఉన్న శ్రుతి హాసన్.. సింగిల్‌గా ఉంటూనే తన కెరీర్, వ్యక్తిగత ఎదుగుదలపై పూర్తి దృష్టి సారించినట్లు తెలిపింది.
“జీవితంలో ఒక తోడు ఉండటం ముఖ్యమే. కానీ, పెళ్లి అనే సాంప్రదాయ చట్రంలో ఇమడటం నావల్ల కాదు. ఒకప్పుడు నేను పెళ్లిపీటల వరకు వచ్చి వెనక్కి తగ్గాను. కేవలం ఒక కాగితం (రిజిస్ట్రేషన్) కోసం, సమాజం కోసం పెళ్లి చేసుకోవడం నాకు నచ్చదు. ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజూ ఒకరినొకరు ఇష్టపడుతూ కలిసి ఉండటమే ముఖ్యం. అలాగే, పెళ్లిళ్ల పేరిట కోట్లు ఖర్చు చేసే బదులు, ఆ డబ్బును అనాథలకు, అవసరాల్లో ఉన్నవారికి దానధర్మాలు చేస్తే ఎంతో అర్థవంతంగా ఉంటుంది.
జీవితంలో తల్లి కావాలని, ఆ మాతృత్వాన్ని అనుభవించాలని నాకు ఎంతో ఆశగా ఉంది. నాకు ఒక బిడ్డకు తల్లిని కావాలని ఉంది. అందుకోసం భవిష్యత్తులో ఒక బిడ్డను దత్తత తీసుకునేందుకు నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నా. కేవలం బయోలాజికల్ కనెక్షన్(Biological connection) మాత్రమే కాకుండా, ఒక బిడ్డను తెచ్చుకుని పెంచడం ఎంతో అద్భుతమైన విషయం. అయితే, నాకు 14 ఏళ్ల వయసు ఉన్నప్పట్నుంచే ‘పీసీఓఎస్’ సమస్య ఉంది.
‘నీకు భవిష్యత్తులో పిల్లలు కలగడం కష్టం కావచ్చు’ అని వైద్యులు చెప్పడంతో చాలా ఏళ్లపాటు ఆందోళన పడ్డా. అయితే, ఇటీవల ఎగ్ ఫ్రీజింగ్, దత్తత వంటి ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే భరోసా లభించింది. భవిష్యత్తులో బయోలాజికల్ పద్ధతిలోనూ ప్రయత్నిస్తూనే, దత్తతకు ప్రాధాన్యత ఇస్తా” అని తెలిపింది. శ్రుతి చేసిన ఈ వ్యాఖ్యలపై మహిళల సంతానోత్పత్తి హక్కులు, దత్తత ప్రాధాన్యత గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.