ట్యాంక్ బండ్‌పై ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్టించాలి
ముకరంపుర, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి) : తెలంగాణ సాయుధ పోరాట(Telangana Armed Struggle) యోధురాలు చాకలి ఐలమ్మ(Chakali Ilamma) జయంతి సందర్భంగా కరీంనగర్ నగరంలోని కలెక్టరేట్ రోడ్డులో ఆమె విగ్రహానికి నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు మరియు బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ రజాకార్ల అణచివేతకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి మహిళల్లో గొప్ప స్ఫూర్తిని నింపిన ధీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు.
ఆనాడు ఐలమ్మ చూపిన పోరాట పటిమే తదనంతర కాలంలో రజాకార్ల నుంచి విముక్తికి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మూలకారకమై నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ యోధులకు సరైన గుర్తింపునిస్తున్న ప్రభుత్వం, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని పునఃప్రతిష్టించి ఆమె త్యాగాలకు తగిన గౌరవం అందించాలని డిమాండ్ చేశారు. వచ్చే జయంతి నాటికల్లా ట్యాంక్ బండ్‌పై విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.