ఫైనల్ లొ భారత్
ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు స్వర్ణానికి అడుగుదూరంలో నిలిచింది. షెఫాలీ వర్మ సెంచరీతో రెచ్చిపోయిన వేళ, స్పిన్నర్లు నందని శర్మ, దీప్తి శర్మ తిప్పేసిన వేళ బంగ్లాను చిత్తుగా ఓడించింది. మరో సెమీస్‌లో పాక్‌ను చిత్తు చేసిన శ్రీలంక భారత్‌తో ఫైనల్ పోరుకు సిద్ధమైంది. దీంతో ఆసియాకప్ ఫైనల్ రిపీట్ కానుంది.
- బంగ్లాపై భారీ విజయం
- సెంచరీతో చెలరేగిన షెఫాలీ
- తిప్పేసిన నందని శర్మ, దీప్తి శర్మ
- లంకతో ఫైనల్ పోరు
నిస్సిన్ , సెప్టెంబర్ 20 : టాస్ గెలిచిన భారత మహిళల జట్టు(Indian womens cricket team) బ్యాటింగ్ ఎంచుకుంది. ఎప్పటిలానే ఓపెనర్లు షెఫాలీ వర్మ, స్మృతి మంధాన(Shafali Verma, Smriti Mandhana) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలోనే 72 పరుగులు బాదే శాడు. స్మృతి(37) ఔటైనా, షెఫాలీ మాత్రం రెచ్చిపోయింది. బంగ్లా బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడింది. పూనకం వచ్చినట్టు చెలరేగిపోయిన ఈ లేడీ సెహ్వాగ్ సెంచరీ పూర్తి చేసుకుంది. కేవలం 49 బంతుల్లోనే శతకం బాదేసింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్(International T20 cricket)లో షెఫాలీకి ఇదే తొలి సెంచరీ.
ఈ మ్యాచ్‌లో 9 సిక్సర్లు బాదిన షెఫాలీ టీ20ల్లో సిక్సర్ల సెంచరీ మార్క్ అందుకుంది. అటు కమలిని(3), రిఛా ఘోష్(2) నిరాశపరిచినా హర్మన్‌ప్రీత్ కౌర్ (40) సత్తా చాటింది. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగుల భారీస్కోరు చేసింది. షెఫాలీ వర్మ 49 బంతుల్లో 100 ( 3 ఫోర్లు, 9 సిక్సర్లు) పరుగులతో అజేయంగా నిలిచింది. ఆసియా క్రీడల చరిత్రలో సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. నాకౌట్ మ్యాచ్‌లలో తన సూపర్ ఫామ్‌ను కొనసాగించిన షెఫాలీ దెబ్బకు బంగ్లా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.
అనంతరం భారీ లక్ష్యఛేదనలో బంగ్లా చేతులెత్తేసింది. భారత స్పిన్నర్ల దెబ్బకు ఓపెనర్ దిలారా తప్పిస్తే మిగిలిన బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆరంభం నుంచే భారత బౌలర్లు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. బంగ్లా బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుస వికెట్లు పడగొట్టారు. కేవలం 49 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. నందని శర్మకు తోడు దీప్తి శర్మ కూడా చెలరేగడంతో బంగ్లాదేశ్ మహిళల జట్టు 15.4 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది.
దీంతో భారత్ 114 పరుగుల భారీ తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. ఈ విజయంతో కనీసం రజతం ఖాయం చేసుకున్న భారత్ ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది. అంతకుముందు జరిగిన మరో సెమీఫైనల్లో లంక జట్టు పాక్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ మహిళల జట్టు 177 పరుగులు చేసింది.
తర్వాత ఛేజింగ్‌లో శ్రీలంక దూకుడుగా ఆడి 17.5 ఓవర్లలోనే టార్గెట్‌ను అందుకుంది. కెప్టెన్ చమరి ఆటపట్టు 83 పరుగులతో లంకను గెలిపిం చింది. కాగా ఇటీవల ఆసియాకప్ ఫైనల్లోనూ భారత్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. ఆ పోరు లో లంకను ఓడించి కప్ గెలిచిన భారత్ మంగళవారం జరిగే ఫైనల్లో అదే జోరు కొనసాగించి స్వ ర్ణం కైవసం చేసుకోవాలని ఎదురుచూస్తోంది.
స్కోరు బోర్డు
భారత్ ఇన్నింగ్స్ : 195/4 ( షెఫాలీ వర్మ 100 నాటౌట్, హర్మన్‌ప్రీత్ కౌర్ 40, స్మృతి మంధాన 37 ; మరుఫా 1/43, మేగలా 1/25 )
బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : 81 ఆలౌట్ (దిలారా 27, సుల్తానా 12, షర్మిన్ 10 ; దీప్తి శర్మ 3/7, నందని శర్మ 3/25)