బీసీ సంక్షేమ శాఖలో అర్హులకు అన్యాయం

25-09-2026 | 05:35am

ప్రమోషన్లు, బదిలీలపై విచారణ జరపాలి

కీలక పోస్టులు భర్తీ చేయాలి

నాన్ బీసీలను వెంటనే తొలగించాలి

బీసీ సంక్షేమ సంఘం నేతల డిమాండ్ 

ముషీరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): బీసీ సంక్షేమ శాఖ(BC Welfare Department)లో ఇటీవల జరిగిన ప్రమోషన్లు, బదిలీల్లో అవకతవకలు జరిగాయని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆరోపించారు. అనర్హులకు ఉన్నత పదవులు కల్పించి అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు. తక్షణమే బీసీ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని వారు డిమాండ్ చేశారు.

ఈ మేరకు గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ ముదిరాజ్, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.రాజేందర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పగిళ్ల సతీష్ కుమార్‌లు మాట్లాడుతూ బీసీ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఎండీ తదితర కీలక పోస్టులను పూర్తిస్థాయి అధికారులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

వార్డెన్ల బదిలీల్లో నిబంధనలు పాటించలేదని, దీంతో హాస్టళ్ల పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు. ప్రమోషన్లు, బదిలీలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్య మం చేపడతామని హెచ్చరించారు. నాన్ బీసీలను వెంటనే తొలగించి బీసీలనే నియమించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం కన్వీనర్లు నిఖిల్ పటేల్, శివకుమార్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం కార్యదర్శి అంజి గౌడ్, నరహరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు