తెలంగాణ తెచ్చుకోవడమే మాకు శాపమా?
స్వరాష్ట్రంలోనే ఉద్యోగుల సమస్యలకు బీజం.. ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్సీ, డీఏలు పెండింగే లేవు
- ప్రత్యేక రాష్ట్రంలోనే ఎందుకున్నాయో ప్రభుత్వమే చెప్పాలి
- పీఆర్సీ, ఓపీఎస్, డీఏ, మరో 42 సమస్యల పరిష్కారమే లక్ష్యం
- ఉద్యోగుల సంకల్ప సభలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్
ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు
* పీఆర్సీ, పెండింగ్ డీఏలు వెంటనే విడుదల చేయాలి.
* సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్‌ను పునరుద్ధరించాలి.
* 2004కు ముందు చేరిన ఉద్యోగులకు ఓపీఎస్ అమలు చేయాలి.
* పెండింగ్‌లో ఉన్న బిల్లులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే చెల్లించాలి.
* ప్రతి నెలా రూ. 2 వేల కోట్ల నిధులు విడుదల చేయాలి.
* 317 జీవో, జీవో 25 సమస్య పరిష్కరించాలి.
* వీఆర్‌ఓలకు జీవో 81 అమలు చేయాలి.
* కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి.
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): తెలంగాణ ఏర్పడితే మంచి పీఆ ర్సీలు, డీఏలు వస్తాయని, సమస్యలు తీరుతాయని ఆశించామని, కానీ.. స్వరాష్ట్రం లోనే ఉద్యోగుల సమస్యలు మొదలయ్యాయని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వీ లచ్చిరెడ్డి (Telangana Employees JAC Chairman V. Lachi Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. సకల జనుల సమ్మె (All-people's strike) చేసి తెలంగాణ తెచ్చుకోవడమే ఉద్యోగులు చేసిన తప్పా అని ప్రశ్నించారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆదివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప సభలో వి.లచ్చిరెడ్డి సభకు తరలివచ్చిన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీఆ ర్సీ, డీఏలు పెండింగ్‌లో లేవని, తెలంగాణ రాష్ట్రంలో ఎందుకున్నాయని ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Chief Minister Revanth Reddy) , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka) అనేకసార్లు ఉద్యోగులతో చర్చలు జరిపారని, ఈ చర్చల్లో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని కోరుతున్నామని అన్నారు. జూన్ 2న పీఆ ర్సీ నివేదిక తెప్పించుకొని, అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. రాష్ట్రంలో ఒక్క సంక్షేమ పథకం ఎక్కడా ఆగడం లేదని, కానీ.. ఉద్యోగులకు హక్కు గా రావాల్సిన పీఆర్సీ, డీఏ ఇవ్వడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు.
ఉద్యోగులపైనే వివక్ష, చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. ఉద్యోగుల హెల్త్‌స్కీం అమలులో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వ పాలనలో కీలకపాత్ర పోషించే ఉద్యోగుల పట్ట మానవీయ కోణంలో ఆలోచించి.. సమస్యలను పరిష్కరించాలని కోరారు.
సీపీఎస్‌ను రద్దు చేయాలి..
ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం ఆలోచించేలా చేయడమే ఈ సంకల్ప సభ లక్ష్యమని వి.లచ్చిరెడ్డి పేర్కొన్నారు. 20, -22 ఏళ్లుగా పని చేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు. ఉద్యోగుల కోసం ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను స్వాగతిస్తున్నామన్నారు.
ఇదే సమయంలో ఉద్యోగుల హక్కులను, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, పీఆర్సీ అమలు చేయాలని, పెండింగ్ డీఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు మరో 42 సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఉద్యోగులు సంఘటితం కావాలి: వొడ్నాల రాజశేఖర్
అంతకుముందు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సెక్రటరీ జనరల్ వొడ్నాల రాజశేఖర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం, విమర్శించడం తమ ఉద్దేశం కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నామన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్చలకు పిలవడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. సమావేశంలో తెలంగాణ జేఏసీ నాయకులు ఎస్.రాములు, మహిపాల్‌రెడ్డి, బాణాల రాంరెడ్డి, నిర్మల, రాధ, గరికె ఉపేందరావు, దర్శన్‌గౌడ్, కృష్ణుడు, అబీబుద్దీన్, కుమార్, చంద్రశేఖర్ గౌడ్, సైదులు, రాధ, రమేష్ పాక, వి.భిక్షం, పెంటయ్య, అరికెల వెంకటేశం, ఉపేందరావు, బాలస్వామి తదితరులు పాల్గొని మాట్లాడారు.






