చర్లలో భర్తల పాలన కాదు
- చెక్కు పవర్ చిచ్చే అభివృద్ధికి అడ్డంకి
- పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్‌ల మధ్య లావాదేవీల గొడవలు
- తీర్మానం లేకుండా బిల్లుల చెల్లింపు?
చర్ల, సెప్టెంబర్ 23, (విజయ క్రాంతి) : చర్ల మండలం(Charla Mandal)లోని 26 గ్రామ పంచాయతీ(Gram Panchayat)ల్లో మహిళా సర్పంచుల భర్తల(Husbands of women Sarpanches) పెత్తనం అంటూ ఒక వర్గం మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, అసలు సమస్య చెక్కు పవర్(Cheque power), నిధుల లావాదేవీల చుట్టూనే తిరుగుతోందని పలువురు సర్పంచులు పేర్కొంటున్నారు. మండలంలో 13 మహిళా సర్పంచులు స్వయంగా విధుల్లో కొనసాగుతూ, గ్రామసభలు, ఎంపీడీఓ సమావేశాలు, పంచాయతీ తీర్మానాల్లో పాల్గొంటున్నారు. హాజరు రిజిస్టర్, ప్రభుత్వ కార్యాలయాల్లో వారి సంతకాలే ఇందుకు నిదర్శనం. ఒకరిద్దరి వ్యవహారాన్ని 26 పంచాయతీలకు సర్పంచ్ వ్యవస్థ(Sarpanch System) ప్రతిష్టను దిగజార్చడం సరికాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసలు వివాదం ఏంటి?
చాలా పంచాయతీల్లో సర్పంచ్ ఒక వర్గం, ఉప సర్పంచ్ మరో వర్గం. ‘ఆ వర్కు నేనే చేశాను‘ అనే పోటీతో బిల్లుల విషయంలో పట్టింపులు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన నిధులకు మించి ఖర్చు చూపించి, పాలకవర్గ తీర్మానం లేకుండా చెల్లింపులు చేయాలని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చట్టం ఏం చెబుతోంది?
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం(Telangana Panchayat Raj Act) 2018 ప్రకారం సాధారణ నిధులకు సర్పంచ్, ఉప సర్పంచ్ ల జాయింట్ సంతకం తప్పనిసరి. అయితే 15వ ఆర్థిక సంఘం నిధుల ప్రత్యేక ఖాతాకు సర్పంచ్ ,పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకాలు అని ప్రభుత్వం మెమో ఇవ్వడంతో గందరగోళం నెలకొంది. ఈ అయోమయాన్నే కొందరు ఆసరాగా తీసుకుని అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నారని సర్పంచుల ఆరోపణ.ఈ గొడవల వల్ల స్ట్రీట్ లైట్లు, డ్రైనేజీ పనులు, మల్టీ పర్పస్ వర్కర్ల జీతాలు ఆగి పోతున్నాయని, యూసీ లు సమర్పించ క కేంద్ర నిధుల విడుదల ఆలస్యమవుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ప్రజలు కోరుతున్నది: ప్రతి పనికి ఏ ఖాతా నుండి నిధులు తీశారో గ్రామసభలో చెప్పాలని, తీర్మానం కాపీని నోటీస్ బోర్డులో పెట్టాలని, అన్ని లావాదేవీలను ఆన్ లైన్ పోర్టల్ లో పారదర్శకంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు. చెక్కు పవర్ పై జిల్లా అధికారులు స్పష్టత ఇచ్చి, 26 పంచాయతీల్లో నెలకొన్న ప్రతిష్టంభన కు తెర దించాలని సర్పంచుల సంఘం విజ్ఞప్తి చేస్తోంది.