ఏండ్లు గడిచినా.. ప్రారంభం మరిచేనా?
- నిరుపయోగంగా జాజిరెడ్డిగూడెం వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు
- నాటి నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్ రావు చొరవతో నిర్మాణం
- రూ.1.55 కోట్లతో 11 ఏళ్ల కిందట 4 ఎకరాల్లో నిర్మాణం
- నిర్మాణం పూర్తయినా అందుబాటులోకి రాక రైతుల అవస్థలు
- వినియోగంలోకి తేవాలని అన్నదాతల వేడుకోలు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), సెప్టెంబర్ 9: జాజిరెడ్డిగూడెం మండల(Jajireddygudem Mandal) పరిధిలో రైతుల సంక్షేమం కోసం నిర్మించిన వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు పాలకుల, అధికారుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. రెండు జాతీయ రహదారులైన నకిరేకల్-తానంచర్ల, సూర్యాపేట-జనగామ జాతీయ రహదారుల వెంట మండల కేంద్రం శివారులో నిర్మించిన ఈ యార్డు ప్రారంభోత్సవానికి నోచుకోకుండానే 11 ఏళ్లుగా నిరుపయోగంగా దర్శ నమిస్తుంది. కోట్లాది రూపాయల ప్రజాధన ం వెచ్చించి నిర్మించిన ఈ సముదాయం రైతులకు కనీస ప్రయోజనం చేకూర్చకపోవడ ంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నీటిపారుదల సలహాదారు విద్యాసాగర్ రావు చొరవతో..
గత 2015-16 ఆర్థిక సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు,స్థానిక గ్రామవాసి అయిన స్వర్గీయ రామరాజు విద్యాసాగర్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ ప్రాంత రైతుల ఇబ్బందులను గమనించిన ఆయన కోరిక మేరకు ప్రభుత్వం స్పందించి జాజిరెడ్డిగూడెంలో 4 ఎకరాల విస్తీర్ణంలో సబ్ మార్కెట్ యార్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.1.55 కోట్ల నిధులను కూడా ప్రభుత్వ వెచ్చించింది.అయితే భవన నిర్మాణం పూర్తయినప్పటికీ వసతులు కల్పించడంలో వైఫల్యం చెందడంతో నాటి నుంచి నేటి వరకు ఈ మార్కెట్ యార్డు ప్రారంభానికి నోచుకోలేదు.
యార్డులో వసతుల లేమి
ఈ యార్డులో కేవలం ఒకే ఒక్క షెడ్డును నిర్మించి అధికారులు చేతులు దులుపుకున్నారు. రైతులు పెద్ద సంఖ్యలో తమ పంటలను తెచ్చుకోవడానికి అదనపు షెడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దానికి తోడు యార్డు ఆవరణలో సీసీ రోడ్ల నిర్మాణం జరపక పోవడంతో వానాకాలంలో వర్షపు నీరు నిలిచిపోయి ప్రాంగణమంతా బురదమయంలా మారుతుంది. ఈ సబ్ మార్కెట్ యార్డులో విద్యుత్ సౌకర్యం, త్రాగునీటి వసతి, టాయిలెట్ల వంటి కనీస అవసరాలు కూడా వినియోగంలోకి తీసుకురాలేదు. కేవలం ప్రతీ పంట సీజన్లో తాత్కాలికంగా ధాన్యం కొనుగోలు కేంద్రంగా మాత్రమే దీనిని వాడుకుంటూ, మిగిలిన కాలమంతా గాలికి వదిలేస్తున్నారన్న విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.
రైతుల వ్యయ ప్రయాసలు..
స్థానికంగా మార్కెట్ అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తాము పండించిన పంటలను అమ్ముకోవడానికి పొరుగున ఉన్న తిరుమలగిరి లేదా జిల్లా కేంద్రం సూర్యాపేట మార్కెట్ యార్డుకు వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల రవాణా ఖర్చులు పెరగడమే కాకుండా ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి నిధులు మంజూరు చేసి, అదనపు షెడ్లు, మౌలిక వసతులు కల్పించాలని ఈ ప్రాంత రైతులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
వినియోగంలోకి తేవాలి..
జాజిరెడ్డిగూడెంలో ఏళ్ల తరబడి నిరుపయోగంగా దర్శనమిస్తున్న వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డ్ ను తక్షణమే రెగ్యులర్ మార్కెట్ గా మార్చాలి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన ఈ మార్కెట్ ను ఇలాగే వదిలేయడం తగదు. యార్డులో వసతులు లేక రైతులు పక్క ఊర్లకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ యార్డును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలి.
బొడ్డు శంకర్, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి