111 మంది జంప్‌జిలానీలు

28-09-2026 | 05:15am
  1. దేశంలో ఐదేళ్లలో పార్టీలు మారిన ఎంపీలు, ఎమ్మెల్యేలు 
  2. వీరిలో 26 శాతం మంది బీజేపీలో చేరారు
  3. 2022 2026 వరకు జరిగిన ఎన్నికల్లో గెలిచి..ఫిరాయింపులు
  4. ఏడీఆర్ నివేదిక వెల్లడి

న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 25: దేశంలో పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలకు(State Legislatures) జరిగిన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏకంగా 111 మంది ఎంపీ లు, ఎమ్మెల్యేలు తమ పార్టీలు మారారు. 2022 నుంచి 2026 వరకు గెలిచాక..తమ పార్టీలను వీడి.. వేరే పార్టీలలోకి ఫిరాయించారు. ఈ ఐదేళ్ల కాలంలోనే 26 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 78 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారినట్లు తేలింది. వీరిలో అత్యధిక సంఖ్యలో నాగాలాండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే 26 శాతాన్ని బీజేపీ తన పార్టీలోకి చేర్చుకుంది.

ఈ విషయంలో నాగ పీపుల్స్ ఫ్రంట్ తర్వాత బీజేపీ రెండో స్థానంలో నిలిచింది. ఈ విస్తువపోయే వివరాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ చేసిన ఒక విశ్లేషణ ప్రకారం.. వ్యక్తిగత పార్టీ ఫిరాయింపులు, పార్టీ విలీనాలు, రాజీనామాల తర్వాత ఉప ఎన్నికల్లో గెలవడం, అనర్హత తర్వాత ఉప ఎన్నికలో సీటు గెలవడం వంటి కేసులు ఇందులో ఉన్నాయి. నాగాలాండ్‌లో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి.

ఇవన్నీ ఎమ్మెల్యేలకు సంబంధించినవే. ఈ కేసులలో అధికభాగం అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డీపీపీ), నాగ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) మధ్య జరిగిన పునరేకీకరణకు సంబంధించినవి. ఏడీఆర్ విశ్లేషణలో, ఎన్‌పీఎఫ్ అత్యధిక సంఖ్యలో చట్టసభ సభ్యులను చేర్చుకున్న పార్టీగా నిలిచింది. మొత్తంగా, పార్టీలు మారిన వారిలో మొదట ఎన్‌డీపీపీ నుంచి ఎన్నికైన 25 మంది శాసనసభ్యులు ఉండగా, 32 మంది చట్టసభ సభ్యులు ఎన్‌పీఎఫ్‌లో చేరారు.

పశ్చిమ బెంగాల్‌లో 20 కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ లోక్‌సభ సభ్యులకు సంబంధించినవే. విశ్లేషణ ప్రకారం.. ఈ 20 మంది కూడా మొదట ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) టికెట్లపై ఎన్నికై, ఆ తర్వాత ఎన్‌సీపీఐలోకి చేరారు. మరోవైపు, అత్యధికంగా ఎన్‌డీపీపీ నుంచి 25 మంది చట్టసభ్యులు ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ నుంచి 20 మంది, కాంగ్రెస్ నుంచి 19 మంది ఉన్నారు. 

ఫిరాయింపులపై ఆంక్షలు విధించాలి

కొన్ని రాష్ట్ర శాసనసభలలో ప్రభుత్వాలు పడిపోవడానికి ఇటీవలి ఫిరాయింపులు కూడా ఒక కారణమని ఏడీఆర్ పేర్కొంది. పార్టీలు మారే శాసనసభ్యులకు సంబంధించి క్రమపద్ధతిలో నిర్వహించబడే, సులభంగా అందుబాటులో ఉండే అధికారిక డేటాబేస్ ఏదీ లేనందున, ఈ ప్రక్రియ తప్పనిసరిగా సమగ్రమైనది కాదని కూడా అది స్పష్టం చేసింది.

ఎన్నికల సంఘం సలహా ఆధారంగా, ఫిరాయింపుల నిరోధక చట్రంలో మార్పులను ఈ పర్యవేక్షక సంస్థ సిఫార్సు చేసింది. ఇందులో భాగంగా, అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఎంపీల విషయంలో అధ్యక్షుల నుంచి రాష్ట్రపతికి, ఎమ్మెల్యేల విషయంలో గవర్నర్లకు బదిలీ చేయాలని సూచించింది. అనర్హత పిటిషన్లపై నిర్ణయానికి కాలపరిమితిని, పార్టీ మారిన వారు తిరిగి ఎన్నికయ్యే వరకు ఆంక్షలు విధించాలన్నారు. 

మరిన్ని వార్తలు