లెక్క పక్కాగా ఉంటేనే న్యాయం
ప్రొ. సంగని మల్లేశ్వర్ :
దేశంలో కుల గణన(Caste Census) డిమాండ్ రోజురోజుకూ బలపడుతున్న వేళ, అసలు ప్రశ్న ఇప్పుడు ఓబీసీ కుల గణన(OBC caste census) జరపాలా ? జరిపితే ఎలా జరగాలి? అన్నదే కీలకం. కోట్లాది వెనుకబడిన తరగతుల భవిష్యత్తును ప్రభావితం చేసే గణన కేవలం ఇంటింటికీ వెళ్లి మీ కులం ఏమిటి? అని అడిగి పేరు నమోదు చేసే ప్రక్రియగా మిగిలిపోతే, దాని ద్వారా లభించే గణాంకాల విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే కుల గణన కోసం.. ముందే ప్రతి కులానికి ప్రత్యేకమైన, శాస్త్రీయంగా రూపొందించిన కోడ్ కేటాయించాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం సాంకేతిక అంశం(Technical aspect) కాదు. సామాజిక న్యాయానికి సంబంధించిన మౌళిక అంశం.
ఒకే కులం.. అనేక పేర్లుగా..!
దేశవ్యాప్తంగా ఒకే కులం వివిధ ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో భిన్న పేర్లతో పిలవబడుతున్నది. ధోబీ.. రజక్‌గా, నాయి బ్రాహ్మణ్.. మంగలి అని, గౌడ్.. ఎడిగ అని, శ్రీశయన.. నాడార్‌గా.. ఇలా అనేక వర్గాలకు ప్రాంతానుసారం పేర్లలో తేడాలు ఉన్నాయి. ఉచ్చారణ మారవచ్చు. అక్షరాల్లో తేడా ఉండవచ్చు. స్థానిక పేరు మారవచ్చు. వృత్తి ఆధారిత గుర్తింపు ఉండవచ్చు. ఈ పేర్లన్నింటినీ వేర్వేరు కులాలుగా నమోదు చేస్తే ఒకే సామాజిక సముదాయం జనాభా అనేక విభాగాలుగా చీలిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా అసలు జనాభా కంటే తక్కువగా లెక్కించబడే అవకాశం ఉంటుంది. అందుకే పేరు కాదు.. శాస్త్రీయ గుర్తింపే ప్రాతిపదిక కావాలి.
పాఠాలు నేర్చుకోవాలి
2011లో కుల గణనకు సంబంధించిన ప్రక్రియలో శాస్త్రీయంగా రూపొందించిన సమగ్ర కుల వర్గీకరణ(Comprehensive Caste Classification), కోడింగ్ వ్యవస్థ(Coding System) లేకపోవడం వల్ల లక్షల సంఖ్యలో కుల పేర్లు నమోదైన అనుభవం ఉంది. 1931 కుల గణనలో నమోదైన కుల సముదాయాల సంఖ్యతో పోల్చితే, సరైన ముందస్తు వర్గీకరణ లేకుండా కుల గణన చేపడితే పేర్ల వైవిధ్యం గణాంకాలను మరింత సంక్లిష్టం చేయవచ్చు. అందుకే గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ముందు కుల జాబితా.. తరువాత కుల కోడ్.. ఆ తర్వాతే గణన అనే శాస్త్రీయ విధానం అవసరం.
ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ పెట్టడం వల్ల డూప్లికెటింగ్ జరిగే అవకాశం ఉండదు. ప్రతి గుర్తింపు పొందిన కులం లేదా సముదాయానికి ఒక ప్రత్యేక సంఖ్యా కోడ్ ఉంటే.. దేశంలోని ఏ రాష్ట్రంలో ఆ సముదాయం ఏ పేరుతో ఉన్నా అది ఒకే సామాజిక గుర్తింపుతో నిర్దారణకు వస్తుంది. అయితే ఆ కోడ్‌కు ఏ కులం, దాని ఉపకులం, పర్యాయపదాలు, ప్రాంతీయ పేర్లు, వృత్తి పేర్లు, చారిత్రక పేర్లు, రాష్ట్రాల వారీ వర్గీకరణ వంటి వివరాలను అనుసంధానించాలి.
అప్పుడు గణకుడు ఒక ప్రాంతీయ పేరును నమోదు చేసినప్పుడు డిజిటల్ వ్యవస్థ దానికి సంబంధించిన ప్రధాన కులాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. కొత్త లేదా వివాదాస్పద పేరు కనిపిస్తే దాన్ని వెంటనే కొత్త కులంగా నమోదు చేయకుండా నిపుణుల పరిశీలనకు పంపవచ్చు. ఈ విధానం కులాల అనవసర విభజనను, డూప్లికేషన్‌ను తగ్గించగలదు.
తెలంగాణ, బీహార్ నుంచి..!
ఓబీసీల లెక్కలు తేలాలంటే తెలంగాణ, బీహార్ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు చాలు. కుల గణన అంటే కేవలం జనాభా లెక్క కాదు. కులంతో పాటు విద్య, ఉపాధి, ఆదాయం, వృత్తి, భూమి, గృహ పరిస్థితులు, వలసలు, ప్రభుత్వ పథకాల లబ్ధి, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలు కూడా తెలిసినప్పుడే సామాజిక న్యాయ విధానాలకు పూర్తి స్థాయి ఆధారం లభిస్తుంది. తెలంగాణలోని సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సర్వే విధానం కుల సమాచారాన్ని ఇతర సామాజిక-ఆర్థిక సూచికలతో అనుసంధానించే విస్తృత దృక్పథాన్ని చూపించింది.
బీహార్ కుల సర్వే కుటుంబ స్థాయి సమాచార సేకరణ, కుల కోడింగ్, క్రమబద్ధమైన వర్గీకరణ వంటి అంశాల ప్రాధాన్యాన్ని చూపించింది. ఈ రెండు అనుభవాల నుంచి పాఠాలు తీసుకుని దేశానికి అనువైన సమగ్ర విధానాన్ని రూపొందించాలి. ఇక్కడ మరో ముఖ్యమైన సమస్య ఉంది. ఒకే సముదాయం ఒక రాష్ట్రంలో ఓబీసీగా, మరో రాష్ట్రంలో వేరే వర్గంలో ఉండవచ్చు. అందువల్ల జాతీయ కుల డేటాబేస్ రాష్ట్రాల ప్రత్యేక వర్గీకరణలను చెరిపివేయకూడదు.
దానికి బదులుగా జాతీయ కుల కోడ్, రాష్ట్ర కోడ్, కుల పేరు, ప్రత్యామ్నాయ పేరు, రాష్ట్ర వర్గం, ఉపవర్గం వంటి వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలి. అప్పుడు ఒక సముదాయం జాతీయ సామాజిక గుర్తింపు, ఆయా రాష్ట్రాల్లోని చట్టపరమైన వర్గీకరణ రెండూ స్పష్టంగా ఉంటాయి. రాష్ట్రాల మధ్య వర్గీకరణ తేడాలను ఆయా రాష్ట్రాలకే వదిలిపెట్టడం సమంజసం.
విశ్వసనీయ డేటా అవసరం
భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ నినాదం ‘జిత్నీ ఆబాదీ, ఉత్నా హిస్సా (జనాభా ఎంత ఉంటే వాటా అంత)’ అనే సూత్రం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అయితే జనాభా ఎంతన్నది శాస్త్రీయంగా, నిష్పక్షపాతంగా, కులాల వారీగా ఖచ్చితంగా తెలియకపోతే జనాభా ఆధారిత విధానాలకు పటిష్టమైన గణాంక పునాది ఉండదు. విద్యలో రిజర్వేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం, ఉన్నత విద్య, సంక్షేమ పథకాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి రంగాల్లో ఓబీసీలకు న్యాయమైన అవకాశాలను రూపొందించాలంటే.. కులాల వారీగా విశ్వసనీయమైన డేటా అవసరం.
అంతేకాదు, ఓబీసీ వర్గం అంతర్గతంగా కూడా సమాన స్థితిలో లేదు. ఏ సముదాయాలు రిజర్వేషన్లను, విద్యా అవకాశాలను, ప్రభుత్వ ఉద్యోగాలను, సంక్షేమ పథకాలను ఎంతవరకు పొందుతున్నాయో తెలుసుకోవడానికి కులాల వారీ డేటా అవసరం. అయితే డేటా సేకరణ మాత్రమే కాదు.. పారదర్శకత కూడా కావాలి. కుల గణన విధానం, ప్రశ్నావళి, కుల కోడ్ వ్యవస్థ, ధృవీకరణ విధానాలను గణన ప్రారంభానికి ముందే ప్రజలకు వెల్లడించాలి.
గణన అనంతరం కుల పేర్లను ఎలా వర్గీకరించారు? పర్యాయపదాలను ఎలా కలిపారు? కొత్త పేర్లను ఎలా ధృవీకరించారు? డూప్లికేట్లను ఎలా తొలగించారు? వంటి అంశాలను ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించాలి. అదే సమయంలో స్వతంత్ర గణాంక ఆడిట్, నిపుణుల ధృవీకరణ, కుటుంబాల పునఃపరిశీలన వంటి ప్రక్రియలు ఉండాలి.
మొక్కుబడి గణన కాదు..!
కులగణన కావాలి. కానీ అస్పష్టమైన, మొక్కుబడి గణన కాదు.. శాస్త్రీయ గణన కావాలి. కులాల లెక్క కావాలి. కానీ పేర్ల గందరగోళం కాదు.. ప్రత్యేక గుర్తింపు కావాలి. ప్రతి కుటుంబం లెక్కలోకి రావాలి. ప్రతి సముదాయం శాస్త్రీయంగా గుర్తించబడాలి. ప్రతి కులానికి ప్రత్యేక కోడ్ ఉండాలి. ప్రతి నమోదుకు ధృవీకరణ ఉండాలి. ప్రతి గణాంకం పారదర్శకంగా ప్రజల ముందుకు రావాలి.
ఎందుకంటే రిజర్వేషన్లు, విద్య, ఉపాధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై భవిష్యత్ విధానాలు ఆధారపడేది ఈ గణాంకాలపైనే. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఓబీసీ కులగణనకు ముందు జాతీయ స్థాయి కుల జాబితా, ప్రత్యేక కుల కోడ్ వ్యవస్థ, డిజిటల్ డేటా సేకరణ, స్వతంత్ర ధృవీకరణ, పారదర్శక ఆడిట్ వంటి వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
2011లో లోక్‌సభలో ఓబీసీలకు న్యాయం జరగాలంటే కులగణన అవసరమని గోపీనాథ్ ముండే, హుకుందేవ్ నారాయణ్ యాదవ్ వంటి బీజేపీ నాయకులు చేసిన డిమాండ్లను కూడా ఈ చర్చలో గుర్తు చేసుకోవాలి. నాటి అధికార, ప్రతిపక్ష రాజకీయ వైఖరులు, ఆ తర్వాతి పరిణామాలను ప్రజలు తమదైన దృష్టితో పరిశీలిస్తున్నారు. దేశ జనాభాలో వెనుకబడిన వర్గాల వాస్తవ సామాజిక స్థితి ఏమిటో తెలుసుకోవాలంటే నమ్మదగిన గణాంకాలు తప్పనిసరి. అందుకే ఓబీసీ కులగణనను ఒక వర్గం డిమాండ్‌గా కాకుండా దేశ సామాజిక వాస్తవాలను శాస్త్రీయంగా అర్థం చేసుకునే జాతీయ ప్రక్రియగా చూడాలి.
వ్యాసకర్త: కేయూ జర్నలిజం
శాఖ విభాగాధిపతి,
9866255355