కాళేశ్వరం మరమ్మతులు నవంబర్‌లో..

27-09-2026 | 05:30am

2027 వానాకాలానికి ముందే మూడు బరాజ్‌ల పునరుద్ధరణ

  1. వచ్చే నెల 5న సీడబ్ల్యూసీ పరిశీలనకు డిజైన్లు భద్రత, నాణ్యతలో రాజీ లేదు
  2. జాతీయ సంస్థలు, నిపుణుల సూచన మేరకే పనులు
  3. నీటి పారుదల శాఖ- మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడి
  4. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణపై ఉన్నతస్థాయి సమీక్ష 

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులను నవంబర్ రెండోవారంలో  ప్రారంభించనున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy) ప్రకటించారు. మూడు బరాజ్ లను 2027 వర్షాకాలానికి ముందే పునరుద్ధరించి అందుబాటులోకి తీసుకువ స్తామని మంత్రి పేర్కొన్నారు.

హైదరాబాద్ బేగంపేటలోని కుందన్‌బాగ్‌లో తన అధికారిక క్యాంపు కార్యాలయంలో శనివారం నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఇంజినీర్లతో కాళేశ్వరం బరా జ్‌ల పునరుద్ధరణ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మూడు బరాజ్‌లను పటిష్టం చేయడంతోపాటు వాటి నిర్వహణ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో పున రుద్ధరించేందుకు అవసరమైన డిజైన్లను ప్రభుత్వం ఖరారు చేసిందని తెలిపారు.

పునాదుల బలోపేతం, స్టిల్లింగ్ బేసిన్ల పొడిగింపు, కొత్తగా కట్ ఆఫ్ వాల్స్ నిర్మాణం, వరద ప్రవాహ వేగ నియంత్రణ ఏర్పాట్లు, లోపాల సవరణ, పునా దుల కింద నీటి చేరికను అరికట్టడం వంటి కీలక పనులు ప్రతిపాదనల్లో ఉన్నాయన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్డీఎస్‌ఏ), నిపుణుల సూచనల మేరకు బరాజ్‌ల పునరుద్ధరణకు ప్రణాళికను రూపొందించినట్లు మంత్రి వెల్లడించారు.

పనుల నాణ్యత విషయంలో రాజీ ఉండదని, శాస్త్రీయ అధ్యయనాలు, జాతీయ స్థాయి సాంకేతిక సంస్థల సిఫార్సుల ఆధారంగానే ప్రతి పని జరుగుతుందని స్పష్టంచేశారు. ప్రతిపాదిత డిజైన్లను పుణెలోని కేంద్ర జల, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్)లో కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ నమూనాల ద్వారా పరీక్షిస్తున్నట్లు తెలిపారు. వివిధ స్థాయిల్లో వరద ప్రవాహం ఉన్నప్పుడు బరాజ్‌ల వద్ద నీటి ప్రవాహ తీరు ఎలా ఉంటుంది, ప్రతిపాదించిన చర్యలు ఎంత సమర్థంగా పనిచేస్తాయో ఈ పరీక్షల ద్వారా నిర్ధారిస్తారని చెప్పారు. 

సీడబ్ల్యూసీ ఆమోదానికి డిజైన్లు..

ఖరారు చేసిన డిజైన్లను అక్టోబర్ 5న ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందు ఉంచనున్నట్లు మంత్రి వెల్లడించారు. కమిటీ నిపుణులు వాటిని పరిశీలించి అవసరమైన సూచనలు, సిఫార్సులు చేస్తారని తెలిపారు. సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

పునరుద్ధరణ పనులకు సంబంధించిన సమగ్ర వ్యయ అంచనాలను నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ సిద్ధం చేస్తుందని, ప్రభుత్వ అనుమతి కోసం కాంట్రాక్టు విధానాన్ని కూడా ఖరారు చేస్తున్నట్లు పేర్కొన్నారు. డిజైన్లకు అనుమతి లభించిన వెంటనే టెండర్లను పిలిచి, పనులను అప్పగించేలా ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.

పనుల అమలులో కఠినమైన నాణ్యత ప్రమాణాలు, స్వతంత్ర పరీక్షలు, స్పష్టమైన కాలపరిమితులు ఉండాలని, నిర్ణీత గడువులో పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు. పునరుద్ధరణ పనులు పూర్తి చేసి, జాతీయ సాంకేతిక సంస్థల నుంచి అనుమతులు వచ్చిన తర్వాతే బరాజ్‌లను తిరిగి నిర్వహణలోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.  


మరిన్ని వార్తలు