తెలుగులోకి కీర్తి సురేశ్ కాంట్రవర్సీ మూవీ!
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ (Keerthy Suresh)ప్రధాన పాత్రలో నటించిన తాజాచిత్రం ‘డోరతీ’. ఈ సినిమా ఇప్పటికే పలు భాషల్లో విడుదలై, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడీ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తాజాగా చిత్రబృందం అధికారంగా ప్రకటించింది. తెలుగు రిలీజ్ అప్డేట్‌ను పంచుకుంటూ ‘అపారమైన ప్రేమ, సానుకూల స్పందన తర్వాత, డోరతీ మూవీ టాలీవుడ్‌కు వస్తోంది.
తెలంగాణ, ఏపీ లో స్పిరిట్ మీడియా ఇన్ ద్వారా అక్టోబర్ 2న ఈ చిత్రం విడుదల కానుంది’ అంటూ ఈ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను పంచుకున్నారు. ఇదిలావుంటే, సెప్టెంబర్ 25న విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి తెరతీసిందీ చిత్రం. ఈ సినిమాలో ఉన్న బోల్ట్ కంటెంట్, ఇద్దరు పురుష పాత్రల మధ్య చూపించిన ఇంటీమేట్ సీన్లు, ముద్దు సన్నివేశాలు నెట్టింట పెనుతుఫానుకు కారణమయ్యాయి.
తమిళ సంస్కృతిని తక్కువ చేసి చూపిస్తున్నారంటూ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌ను, హీరోయిన్ కీర్తి సురేశ్‌ను ఒక వర్గం నెటిజన్లు మండిపడ్డారు. అంతేకాదు ఈ సినిమాను మలేషియాలో థియేటర్లలో విడుదల చేయడానికి అనుమతి లభించలేదు. మరి ఇలాంటి వివాదాల మధ్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ చిత్రాన్ని ఇక్కడ ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలి.