విధులకు అడ్డుపడితే చట్ట ప్రకారం చర్యలు
తొర్రూర్ డిఎస్పి కృష్ణ కిషోర్
మహబూబాబాద్ జిల్లా: పోలీసుల విధులకు(Police duties) అడ్డు తగలడం, దౌర్జన్యానికి పాల్పడ్డ వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్(Mahabubabad District Thorrur DSP Krishna Kishore) స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిపై చేయి చేసుకోవడం, బెదిరించడం, విధులకు ఆటంకం కలిగించడం లాంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని, ఇలాంటి ఘటనలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మరిపెడ మండలం తానంచర్ల గ్రామంలో వినాయక నిమజ్జనం(Vinayaka Immersion) సందర్భంగా మరిపెడ సూర్యాపేట హైవే పైన డీజే ఏర్పాటు(DJ setup) చేసి న్యూసెన్స్ చేస్తున్నారని 112 కు సమాచారం అందడంతో మడిపేట ఎస్సై ప్రభాకర్ రెడ్డి సిబ్బంది అక్కడికి వెళ్లి రోడ్డుమీద ఉండకుండా పక్కకు వెళ్ళండి అని, ట్రాఫిక్ అంతరాయం కలిగించకండి అని చెప్పడం జరిగిందన్నారు. అయితే పోలీసుల మాటలను పట్టించుకోకుండా కొందరు దురుసుగా కానిస్టేబుల్ పట్ల వ్యవహరించి, ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ అంతరాయం కలిగించడంతో పోలీసులు ట్రాక్టర్ ను రోడ్డు పక్కకు తరలించిన అనంతరం కూడా కొందరు రోడ్డుపై బైఠాయించి పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని డిఎస్పీ తెలిపారు.
ఈ సంఘటన నేపథ్యంలో మాజీ సర్పంచ్, డీజే నిర్వాహకుడితోపాటు 17 మందిపై దర్యాప్తు చేపట్టి, ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. నేర స్వభావం, గత ప్రవర్తన, చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా అర్హత ఉన్న సందర్భంలో నిందితులపై రౌడీషీట్ కూడా ప్రారంభిస్తామని, చట్ట ప్రకారం అనుమతులు లేకుండా డిజె సౌండ్ ఏర్పాటు చేయడం పట్ల కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు.