పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతులనే పూజిద్దాం
ముకరంపుర, సెప్టెంబర్ 13(విజయ క్రాంతి): వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణలో భాగంగా కరీంనగర్ నగరంలోని 42వ డివిజన్ భగత్ (Division Bhagat)నగర్ క్యాంపు కార్యాలయం వద్ద మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు డివిజన్ ప్రజలకు మట్టి గణపతి విగ్రహాలను అందజేశారు.ఈ సందర్భంగా యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు, నీటి కాలుష్యం పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు ప్రమాదకర రసాయన రంగులతో తయారుచేసిన విగ్రహాల వల్ల జలాశయాలు కలుషితమై జీవజాలానికి ముప్పు వాటిల్లుతుంది అన్నారు. అందుకే శాస్త్రోక్తంగా పర్యావరణ హితంగా మట్టి గణపతులను పూజించడమే అత్యుత్తమమని స్పష్టం చేశారు.కరీంనగర్ నగర ప్రజలకు, భగత్ నగర్ డివిజన్ వాసులకు వినాయక చవితి పర్వదిన ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.