ఎమ్మెల్యే తీరుపై మార్కెట్ కమిటీ చైర్మన్ ఫైర్
చర్ల, విజయ క్రాంతి: చర్ల మండల కాంగ్రెస్(Congress)లో సీనియర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కష్టకాలంలో పార్టీని భుజాలపై మోసిన సీనియర్లను పక్కనపెట్టి, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వలసవాదులకు పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. ఇదే తీరు కొనసాగితే రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరించారు.
పార్టీ కోసం సొంత డబ్బులు ఖర్చుపెట్టిన సీనియర్ నాయకుడు బండారు రామకృష్ణకే సొసైటీ చైర్మన్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిన్న మొన్న వచ్చిన పొలిన లంక రాజుకు పదవి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. నామినేటెడ్ పోస్టులన్నీ సీనియర్లకే ఇవ్వాలన్నారు.
ఇసుక కోసమే రాజకీయం
ఇసుక ర్యాంపుల కోసమే కొటేరు శ్రీనివాస్ రెడ్డి గోదావరి పరివాహక పంచాయతీల్లో రాజకీయం చేస్తున్నారని, ఆయన చెప్పిన కాంట్రాక్టర్లకే ఎమ్మెల్యే వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఇసుక లారీలతో రోడ్లు ధ్వంసమవుతున్నా, ప్రమాదాల్లో ప్రాణాలు పోతున్నా ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదన్నారు.
ఈ సమావేశంలో న్యాయవాది పరిటాల సంతోష్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వచ్చిన తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేనా? కాంగ్రెస్ ఎమ్మెల్యేనా? క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీనియర్లకు న్యాయం జరగకపోతే భవిష్యత్ కార్యాచరణపై పునరాలోచన చేస్తామని, మండల అధ్యక్ష పదవి మార్పు తప్పదని ఇర్పా శ్రీనివాసరావు స్పష్టం చేశారు