మావోయిస్టుల పునరావాసానికి చర్యలు వేగవంతం చేయాలి...

16-09-2026 | 07:46pm

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పునరావాస ప్రయోజనాలు

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు 

ములుగు, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులందరికీ పునరావాస ప్రయోజనాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు(District Collector Bhorkhade Hemant Sahadeorao) సంబధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం ములుగు నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో లొంగిపోయిన మావోయిస్టుల పునరావాసానికి సంబంధించి జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడిఏ పిఓ లెనిన్ వత్సల్ టోప్పో తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సహాయం, ఇంటి స్థలాలు, వ్యవసాయ భూములు, ఉపాధి అవకాశాలు తదితర పునరావాస ప్రయోజనాలు కల్పించే అంశాలపై సమగ్రంగా చర్చించారు.

పెండింగ్‌లో ఉన్న అంశాలను పరిశీలించి, అవసరమైన తదుపరి చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి పునరావాస ప్రయోజనాలు సకాలంలో అందేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దరఖాస్తులు, ధ్రువపత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి పునరావాస ప్రక్రియలో జాప్యానికి తావులేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జీ, ములుగు డీఎస్పీ రవీందర్, జిల్లా అధికారులు రామ్మోహన్, రవీందర్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు